‘ఓ మై గాడ్’… బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం. 2012లో రిలీజైన ఈ కోర్ట్ డ్రామా అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి లాంటి పాప్యులర్ స్టార్స్ ఉండటంతో మరింతగా ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే, ముంబైలో తాజాగా వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం… ‘ఓ మై గాడ్’కి సీక్వెల్ రానుందట!
అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’లో శ్రీకృష్ణుడిగా నటించాడు. సీక్వెల్ లోనూ అదే పాత్ర పొషించబోతున్నాడట. ఇక పరేశ్ రావల్ మాత్రం ఈసారి తెరపై కనిపించబోవటం లేదు. ఆయన స్థానంలో మరో హైలీ టాలెంటెడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠీ నటించనున్నాడు. అయితే, కరోనా వ్యాప్తి, సెకండ్ వేవ్ వల్ల లాక్ డౌన్ లేకపోయి ఉంటే ‘ఓ మై గాడ్ 2’ ఈపాటికి సెట్స్ పైన ఉండేదే. కానీ, ప్యాండమిక్ వల్ల ప్లాన్స్ అప్ సెట్ అయ్యాయట. అందుకే, ఇప్పుడు వచ్చే సంవత్సరం మొదట్లో సీక్వెల్ మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు…
‘ఓ మై గాడ్’ సినిమాకి దర్శకుడు ఉమేశ్ శుక్లా కాగా ఇప్పుడు రాబోయే పార్ట్ టూకి ‘రోడ్ టూ సంగమ్’ మూవీ ఫేమ్ అమిత్ రాయ్ డైరెక్షన్ చేయనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక పలు ప్రాజెక్ట్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘బెల్ బాటమ్, అత్రంగీ రే, రామ్ సేతు, రక్షా బంధన్, బచ్చన్ పాండే, పృథ్వీరాజ్’ చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ‘ఓ మై గాడ్ 2’ షూటింగ్ మొదలు కావటానికి, రిలీజ్ కావటానికి కాస్త టైం పడుతుందనైతే చెప్పుకోక తప్పదు.
‘ఓ మై గాడ్’ సినిమానే తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేశ్ ‘గోపాల గోపాల’ మూవీగా రీమేక్ చేశారు. చూడాలి మరి, ఈ సీక్వెల్ కూడా బాలీవుడ్ లో బ్లాక్ బస్టరై టాలీవుడ్ కి వచ్చేస్తుందేమో!
మళ్లీ కృష్ణావతారానికి సిద్ధమవుతోన్న అక్షయ్ కుమార్!
