“కళ్ళ కింద క్యారీ బ్యాగులు…” ఉంటేనేం, కామెడీతో కబడ్డీ ఆడగలిగే సత్తా ఉంటే చాలు, నందులు నడచుకుంటూ రావలసిందే! అంతటి ధీమాతోనే ఎమ్.ఎస్.నారాయణ నవ్వులు పూయించారు. అందువల్లే ఎమ్మెస్ నారాయణను ఐదు సార్లు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డులు వరించాయి. ఎమ్మెస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు, అసంకల్పితంగా ప్రేక్షకుల పెదాలు విచ్చుకొనేవి. ఇక ఆయన కదిలితే చాలు జనానికి చక్కిలిగింతలు కలిగేవి. నోరు విప్పి మాట్లాడితే కితకితలే!
పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో 1951 ఏప్రిల్ 16న నారాయణ జన్మించారు. బాల్యం నుంచీ రివటలా ఉండే ఎమ్మెస్ నారాయణ తన చేష్టలతో చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండేవారు. చదువుకొనే రోజుల్లో మిత్రులకు నవ్వులు పంచారు. ఆపై నాటకాలపై మనసు పారేసుకొని నటనతోనూ ఆకట్టుకున్నారు. కొన్ని నాటకాలు రాసి, వాటికి దర్శకత్వం వహించి, మిత్రులతోనూ నటింపచేసి ఆనందించారు ఎమ్మెస్. చదువు పూర్తయ్యాక లెక్చరర్ గా పనిచేస్తూనే, మళ్ళీ నటనపై మనసు పారేసుకున్నారు. అదే ఆయనను సినిమా రంగంవైపు పరుగులు తీయించింది. సుమన్ హీరోగా నటించిన ‘అలెగ్జాండర్’లో తొలిసారి తెరపై కనిపించారు ఎమ్మెస్ నారాయణ. అదేమి అంత గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది. తరువాత దర్శకుడు రవిరాజా పినిశెట్టితో దోస్తీ కుదిరింది. ఆయన రూపొందించిన ‘ఎమ్.ధర్మరాజు ఎమ్.ఏ., పెదరాయుడు” చిత్రాలలోనూ నటించారు ఎమ్మెస్. అడపాదడపా తెరపై కనిపిస్తున్నా ఎమ్మెస్ నారాయణకు అంతగా గుర్తింపు రాలేదు. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘మా నాన్నకి పెళ్ళి’లో తాగుబోతుగా నటించి భలేగా మెప్పించారు. ఆ తరువాత మరి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎమ్మెస్ నారాయణ నవ్వుల ప్రయాణం సాగించారు. ఆ పయనంలో నవ్వుల పువ్వులు పంచుతూ ముందుకు పోయారు. “మా నాన్నకి పెళ్ళి, రామసక్కనోడు, సర్దుకు పోదాం రండి, శివమణి, దూకుడు” చిత్రాలు ఆయనకు నంది అవార్డును సంపాదించి పెట్టాయి.
ఎమ్మెస్ నారాయణ పర్సనాలిటీని బట్టి, ఆయనతో పలువురు దర్శకులు పేరడీలు చేయించారు. ముఖ్యంగా ‘దూకుడు’లో దర్శకుడు శ్రీను వైట్ల ఆయనతో చేయించిన పేరడీలు తెలుగువారిని విశేషంగా అలరించాయి.
చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి, దర్శకత్వం నెరపిన ఎమ్మెస్, “కొడుకు, భజంత్రీలు” అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో ‘కొడుకు’ చిత్రంలో నారాయణ కుమారుడు విక్రమ్ హీరోగా నటించాడు. కొన్ని చిత్రాలకు రచన కూడా చేసిన నారాయణ, నవ్వుల తోటలోనే అధికంగా గడిపారు. కేవలం 17 సంవత్సరాలలో 700 పైచిలుకు చిత్రాలలో నటించి ఓ రికార్డు నెలకొల్పారు. ఇప్పటికీ ఎమ్మెస్ నారాయణ పేరు వినగానే ఆయన నటించిన పాత్రలే గుర్తుకు వచ్చి నవ్వులు మన సొంతమవుతాయి. ప్రస్తుతం ఎమ్మెస్ నారాయణ భౌతికంగా లేకపోయినా, ఆయన పంచిన నవ్వులు నిత్యం మన మదిలో చిందులు వేస్తూనే ఉంటాయి.