సహజంగా పుట్టిన రోజు నాడు సూపర్ గ్లామర్ లుక్ తో జనం ముందుకు రావాలని ఏ హీరో అయినా అనుకుంటాడు. కానీ టాలీవుడ్ హ్యాండమ్ హీరో నవదీప్ రూటే సపరేట్! హీరో అనే కాదు… నచ్చాలే కానీ ప్రతి నాయకుడి ఛాయలున్న పాత్ర చేయడానికైనా సై అంటాడు నవదీప్. అయితే అతను ప్రస్తుతం ‘లవ్ మౌళి’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఫంకూరీ గిద్వానీ హీరోయిన్. ఇందులో నవదీప్ సరికొత్తగా… అంటే ‘నవదీప్ 2.0’ గా కనిపించబోతున్నాడు. జనవరి 26న అతని పుట్టిన రోజు సందర్భంగా ‘లవ్ మౌళి’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనిని చూసిన వాళ్ళు ‘హే… నవదీప్… వాటీజ్ దిస్!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.