NTV Telugu Site icon

నిన్న కర్ణి సేన, నేడు క్షత్రియ సేన… అక్షయ్ మూవీకి పెరుగుతోన్న సెగ!

Kshatriya body demands name change of Akshay Kumar’s Prithviraj

రొటీన్ రొమాంటిక్ మూవీస్ తీసినంత ఈజీ కాదు చారిత్రక చిత్రాలు రూపొందించటం. పైగా అందులో ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చూపించబోతున్నప్పుడు… సదరు బయోపిక్ మరింత భయభక్తులతో తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘పృథ్వీరాజ్’ సినిమా సంకల్పించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి కూడా రాజకీయ సెగ తప్పటం లేదు! ఆ మధ్య కర్ణి సేన వార్నింగ్ ఇస్తే ఇప్పుడు అఖిల భారత క్షత్రియ మహాసభ రంగంలోకి దిగింది…

పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్ పుత్ లు ఎంతో గౌరవించే రాజాధిరాజు. సహజంగానే ఆయన క్షత్రియుడు. పైగా జీవితంలో ఓటమి అన్నది ఎరుగని చివరి భారతీయ హిందూ సామ్రాట్టు. ఇన్ని విశేషణాలున్న ఆ త్యాగమూర్తి గురించి సినిమా అంటే చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. అంతకు మించి ఇప్పుడు టైటిలే పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది సింపుల్ గా ‘పృథ్వీరాజ్’ అని పేరు పెట్టేశారు. కానీ, అది వీరాధివీరుడైన పృథ్వీరాజ్ చౌహన్ను అవమానించటమే అంటున్నారు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ప్రతినిధులు.

అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ లో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ సంయోగిత పాత్రలో తెరకెక్కుతోన్న ‘పృథ్వీరాజ్’ సినిమా పేరు మార్చాల్సిందే అంటున్నారు రాజ్ పుత్ నేతలు. క్షత్రియ వర్ణాన్ని సూచించే ‘చౌహాన్’ అన్న పదం కూడా టైటిల్ లో ఉండాలని పట్టుబడుతున్నారు. ‘సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ అని రాజ్ పుత్ యోధుడ్ని సగర్వంగా పిలవాలని అంటున్నారు. అంతే కాదు, అటు కర్ణి సేన… ఇటు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ రెండూ కూడా తమకు స్క్రిప్ట్ చూపించాలని, ప్రీవ్యూ ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాము ఒప్పుకోకుండా సినిమా థియేటర్లకు రానీయవద్దని హెచ్చరిస్తున్నారు.

‘పృథ్వీరాజ్’ మూవీపై కొందరు నిరసనకారుల నుంచీ వస్తోన్న అభ్యంతరాలపై ఇంకా దర్శకనిర్మాతలు స్పందించలేదు. వారి డిమాండ్లకు చివరకు తలొగ్గుతారో లేదో చూడాలి. ‘పృథ్వీరాజ్’ సినిమా దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యే అవకాశాలున్నాయి…