వెండితెరపై నటీనటులుగా గుర్తింపు పొందినంత మాత్రాన వారి జీవితాలు వడ్డించిన విస్తరి అనుకోవడానికి వీలు లేదు. అవకాశాలు తగ్గగానే… ఎవరైనా ఏదో ఒక జీవనోపాథి ఎంచుకోవాల్సిన పరిస్థితే. మలయాళంతో పాటు పలు తమిళ చిత్రాలలోనూ నటించిన కార్తీక మాథ్యూ పరిస్థితి కూడా అంతే. చిన్నప్పటి నుండి నటన అంటే మక్కువ ఉన్న కార్తీక యుక్త వయసులో సినిమా నటిగా అవకాశాల కోసం ప్రయత్నించింది. అందులో సక్సెస్ అయ్యింది కూడా. కానీ ఆ తర్వాత వివాహానంతరం ఆమె నటనకు దూరమైంది. అయితే నటనతో పాటు చిన్నప్పటి నుండి తనకు ఇష్టమైన డ్రైవింగ్ పై దృష్టి పెట్టింది. సొంత గ్రామంలో పలు వాహనాలను డ్రైవింగ్ చేయడం ప్రాక్టీస్ చేసిన కార్తీక గత యేడాది లాక్ డౌన్ వల్ల ఉపాథి అవకాశాలు దొరకపోవడంతో ప్రొఫెషనల్ డ్రైవర్ గా మారిపోయింది. తన దగ్గర ఉన్న కాస్తంత డబ్బులతో ఓ ట్రక్ ను కొని పళ్ళను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి దానిని వినియోగించడం మొదలెట్టింది. విశేషం ఏమంటే… తన సొంత ఊరు కన్నూర్‌లోని అజికోడ్ నుండి వజక్కుళంకు పైనాపిల్స్ ను తీసుకెళ్ళి అక్కడి నుండి కొబ్బరికాయలను ట్రక్ లో లోడ్ చేయించి… తిరిగి వస్తూ దుకాణాలలో దింపేది. రాత్రిపూట ట్రక్ నడపడం అంటే తనకెంతో ఇష్టమని, ఆ సమయంలో టీ షర్ట్, జీన్స్ ధరిస్తుంటానని, దానిపై డ్రైవర్స్ డ్రస్ వేసుకుంటానని కార్తిక చేబుతోంది.
తాను యుక్త వయసులో ఉండగా నటించిన చిత్రాలలో ‘కెనాలమ్ కైనరం’, మక్కనా
చిత్రాలు తనకెంతో ఇష్టమని, ఇప్పటికీ అవకాశాలు రావాలే కానీ నటించడానికి సిద్ధమని కార్తీక మాథ్యూ చెబుతోంది. కార్తీక ట్రక్ డ్రైవింగ్ చేస్తుండగా ఇటీవల ఓ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపి, ఆమె నుండి వివరాలు సేకరిస్తుంటే, ఆమె ఓ నటి అనే విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమె ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ మరోసారి కార్తీక మాథ్యూపై పడింది. తనకు జీవితంలో టిప్పర్ ను కొని ఫుల్ లోడ్ తో నడపాలనే కోరిక ఉందని కార్తీక చెబుతుంటుంది. ఆమె భర్త శ్రీజిత్ విదేశాలలో పనిచేస్తుండగా, కొడుకు శ్రీనాథ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చిన కార్తీకకు తమిళ, మలయాళ చిత్ర దర్శకులు మళ్ళీ అవకాశం ఇస్తారేమో చూడాలి.
ట్రక్ డ్రైవర్ గా మారిన నటి!
