NTV Telugu Site icon

ఆ పాట క‌వితాకృష్ణమూర్తి పాడ‌క పోయి ఉంటే…!?

సంగీత ప్రియులంద‌రికీ సుప‌రిచిత‌మైన పేరు క‌వితాకృష్ణమూర్తి. సినిమా సంగీతం,పాప్ మ్యూజిక్, వెస్ట్రన్, ట్రెడిష‌న‌ల్ ఇలా ఏ పేరుతో పిలుచుకొనే సంగీతాన్ని అభిమానించే వారికైనా క‌వితాకృష్ణ‌మూర్తి మ‌ధుర‌గానం స‌దా మ‌దిలో మెద‌లుతూనే ఉంటుంది. జ‌న‌వ‌రి 25న 64 ఏళ్లు పూర్తి చేసుకున్న క‌వితాకృష్ణమూర్తి ఇటీవ‌లే ప్రఖ్యాత గాయ‌కులు మ‌హ‌మ్మద్ ర‌ఫీ అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌ఫీ సాబ్ తో త‌న అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకున్నారు. అప్పట్లో తాను ఎంతో చిన్నపిల్లనైనా, ర‌ఫీ సాబ్ ఎంత‌గానో ప్రోత్సహించార‌నీ క‌విత మ‌న‌నం చేసుకున్నారు. లేడీస్ టైల‌ర్ అనే సినిమా కోసం ర‌ఫీ సాబ్ తో క‌ల‌సి తాను పాడిన రెండు పంక్తుల‌ను జీవితంలో ఎన్నటికీ మ‌ర‌చిపోలేన‌నీ క‌వితాకృష్ణమూర్తి చెప్పారు. దాదాపు ఐదు ద‌శాబ్దాలు గాయ‌నిగా సాగిన త‌న గాన‌ప్రస్థానాన్ని ఇటీవ‌ల క‌విత గుర్తు చేసుకున్నారు. అందులో ఎన్నెన్నో విశేషాల‌ను జ‌నం ముందు ప‌రిచారు.

తాను ఎంతోమంది సంగీత‌దర్శకులు, గాయ‌కులు, గీత ర‌చ‌యిత‌ల‌తో క‌ల‌సి ప‌నిచేశాన‌ని, అంద‌రి ప్రోత్సాహంతోనే తాను గాయ‌నిగా నిల‌దొక్కుకోగ‌లిగాన‌ని క‌వితాకృష్ణమూర్తి వివ‌రించారు. త‌న కెరీర్ లో 1942: ఎ ల‌వ్ స్టోరీ, ఖామోషీ : ద మ్యూజిక‌ల్, బొంబాయి చిత్రాల్లో పాట‌లు పాడ‌డం ఓ మ‌ర‌పురాని అనుభూతి అని తెలిపారు. ఇక శేఖ‌ర్ క‌పూర్ తెర‌కెక్కించిన అనిల్ క‌పూర్, శ్రీ‌దేవి నటించిన మిస్ట‌ర్ ఇండియాలోని హ‌వా హ‌వాయి... పాట‌తోనే క‌వితాకృష్ణమూర్తి చిత్రసీమ‌లో సూప‌ర్ సింగ‌ర్ గా పేరొందారు.నిజానికి ఆ పాట‌ను ముందుగా ప్రఖ్యాత గాయ‌ని ఆశా భోస్లేతో పాడించాల‌ని భావించార‌ట‌. కానీ,ట్రాక్ విన్న త‌రువాత క‌విత గాన‌మే బాగుంటుంద‌ని ఆ చిత్ర సంగీత ద‌ర్శకులు ల‌క్ష్మీకాంత్- ప్యారేలాల్ అనుకున్నారు. దాంతో క‌విత గానంతోనే పాట‌ను కూడా చిత్రీక‌రించారు. ఆ పాట‌లో న‌టించిన శ్రీ‌దేవి, చిత్ర నిర్మాత బోనీ క‌పూర్, ద‌ర్శకుడు శేఖ‌ర్ క‌పూర్ అంద‌రూ క‌వితాకృష్ణ‌మూర్తి వాయిస్ కే ఓటేయ‌డంతో ఆ పాట ఆమె ఖాతాలో చేరింది. ఆ పాట‌తోనే క‌వితాకృష్ణమూర్తి ఉన్నత శిఖ‌రాలు అందుకోవ‌డం విశేషం. దాదాపు యాభై ఏళ్ళ నుంచీ పాట‌లు పాడుతూ ద‌క్షిణాది అన్ని భాష‌ల‌తో పాటు, ఉత్తరాది ప‌లు భాష‌లు, విదేశీ భాష‌లు క‌లిపి మొత్తం 30 భాష‌ల్లో దాదాపు యాభై వేల పాట‌లు క‌విత గ‌ళం నుండి జులువారి అల‌రించాయి. ఆమె గాన‌వైభ‌వానికి 2005లోనే ప‌ద్మశ్రీ పుర‌స్కారం ల‌భించింది. తాను ఎంత‌గానో అభిమానించే ర‌ఫీ సాబ్ పేరిట ఉన్న అవార్డు అందుకోవ‌డం మ‌రింత ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని క‌వితాకృష్ణ‌మూర్తి అంటున్నారు.

ప్రముఖ సంగీత క‌ళాకారుడు, వ‌యోలిన్ విద్వాంసుడు డాక్టర్ ఎల్. సుబ్రహ్మణ్యంను 1999లో పెళ్ళాడారు క‌వితాకృష్ణమూర్తి. ఈ దంప‌తుల‌కు సంతానం లేదు. ప్రస్తుతం బెంగ‌ళూరులో నివాస‌ముంటున్న క‌వితాకృష్ణమూర్తి 64 ఏళ్ల వ‌య‌సులోనూ ఆ నాటి మధురాన్నే పంచుతూ సంగీత‌ప్రియుల‌ను ముగ్ధుల‌ను చేస్తున్నారు. ఆమె మ‌రిన్ని వ‌సంతాలు చూస్తూ, ఆనందంగా సాగిపోవాల‌ని ఆశిద్దాం.