ప్రముఖ గాయకుడు, స్వర్గీయ ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే ఆయనకు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే చాలా కాలంగా ఘంటసాల రత్నకుమార్ కిడ్నీ సమస్యతో డయాలసిస్ పై ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘంటసాల అమర గాయకుడిగా పేరు గడిస్తే, ఆయన కుమారుడైన రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్ళలో తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ గాయకుడు కావాలని తపించానని, కానీ బ్రేక్ రాలేదని రత్నసాగర్ చెబుతుండేవారు. అదే సమయంలో తమిళ చిత్రం కంచి కామక్షి
కి తెలుగులో డబ్బింగ్ చెప్పానని, ఆ సినిమా దాదాపు వందరోజులు ప్రదర్శితం కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయని రత్నకుమార్ అన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ లో వేయికి పైగా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, సంస్కృత చిత్రాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. పది వేలకు పైగా తమిళ, తెలుగు టీవీ సీరియల్ ఎపిసోడ్స్ కు గాత్రాన్ని ఇచ్చారు. యాభైకు పైగా డాక్యుమెంటరీలకు వాయిస్ ఓవర్ అందించారు రత్నకుమార్. గతంలో ఎనిమిది గంటల పాటు నిరవధికంగా డబ్బింగ్ చెప్పి ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. అలానే అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ ఆయన పేరు నమోదైంది. గాయకుడిగా సినిమా రంగంలో గుర్తింపు దక్కకపోయినా పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన లలిత సంగీతాన్ని ఆలపించేవారు. అలానే చాలా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును ఘంటసాల రత్నకుమార్ అందుకున్నారు. ఘంటసాల రత్నకుమార్ దాదాపు యాభై అనువాద చిత్రాలకు రచన కూడా చేశారు. ఆయన కుమార్తె పూజా గాయనిగా రాణిస్తోంది.
ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత
