NTV Telugu Site icon

‘స్టార్ మా డాన్స్ ప్లస్’ లో హీట్ పెంచుతున్న ఫైనలిస్టులు!

గత కొన్ని నెలలుగా స్టార్ మాలో జరుగుతున్న స్టార్ మా డ్యాన్స్ + పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 23న జరుగబోతున్న ఫైనల్స్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రతి ఒక్క గ్రూప్ పోటాపోటీగా ప్రాక్టీస్ చేసి, టైటిల్ ను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ప్లస్ ఫైనల్ పోటీతో పాటుగా రేపు (ఆదివారం) సాయంత్రం 6.00 గం.లకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలే వీక్షించడం ద్వారా 20 లక్షల రూపాయల బహుమతితో పాటు విజేతగా నిలిచేది ఎవరో తెలియనుంది. గత 21 వారాలుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు టీమ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి.
అందులో మొదటిది వాసి టోనీ (యశ్వంత్ మాస్టర్ టీమ్). భారత దేశం తరఫున అంతర్జాతీయ వేదికలలో పాల్గొనాలనే లక్ష్యంతో తాము కృషి చేస్తున్నామని ఈ బృందంలోని వారు చెబుతున్నారు. ఓంకార్ ప్రోత్సాహం, యశ్వంత్ మాస్టర్ తోడ్పాటుతో ఫైనల్స్ కు చేరామన్నది వాసి టోనీ మాట. ఇక రెండవది సంకేత్ సహదేవ్ (యశ్వంత్ మాస్టర్ టీమ్). ఇండియాలో నంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా నిలవాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్న సంకేత్ సహదేవ్, తన చివరి శ్వాసవరకూ నృత్యంతో వీక్షకులను రంజింపచేస్తానని హామీ ఇస్తున్నాడు.

ఇక మూడోది మహేశ్వరి – తేజస్విని. (బాబా మాస్టర్ టీమ్). గత 13 సంవత్సరాలుగా మంజుల రామస్వామి గారి దగ్గర భరత నాట్యం నేర్చుకుంటున్న తాము సంప్రదాయ నృత్య రీతులను వీక్షకులకు చూపాలనుకున్నామని, అది నెరవేరడంతో పాటు ఫైనల్స్ కు చేరడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇక నాలువది జియా ఠాకూర్ (అనీ మాస్టర్ బృందం). ఈ డాన్స్ ప్లస్ షోలో పాల్గొనడం జీవితకాలం అనుభవం అంటున్నారు జియా ఠాకూర్. మొదటిలో లిరికల్, హిప్ హాప్ మాత్రమే తెలిసిన తనకు జానపదంతో పాటు సమకాలీన వైల్డ్ లిరికల్, రోబోటిక్స్, చార్లీ చాప్లిన్ స్టైల్ వంటివి నేర్చుకునే అవకాశం ఈ షో ద్వారా లభించిందని తెలిపారు. ఇక ఐదవది రఘు మాస్టర్ నేతృత్వంలోని డార్జిలింగ్ డెవిల్స్. లెజెండరీ డాన్సర్స్ సమక్షంలో ప్రదర్శనలివ్వడం గొప్ప అదృష్టమని వీరు చెబుతున్నారు. అంతర్జాతీయంగాను భారీ ప్రదర్శనలు ఇవ్వగలమనే నమ్మకం ఈ షో ద్వారా కలిగిందని అంటున్నారు. మరి ఇవాళ, రేపు జరిగే, ఫైనల్స్ లో ఎవరు విజేతగా నిలిచి వీక్షకుల మనసులు దోచుకుంటారో చూడాలి.