NTV Telugu Site icon

పాత – కొత్త తరాల వారధి ఎస్. గోపాల్ రెడ్డి

(జూలై 4 బర్త్ డే సందర్భంగా…)

టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ ఎవరైనా మొదటిసారి మెగా ఫోన్ చేతిలోకి తీసుకోబోతున్నాడంటే అతని తొలి ప్రాధాన్యం సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి! అలనాటి ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి నుండి మెళకువల్ని నేర్చుకున్న ఎస్. గోపాల్ రెడ్డి అంటే వాళ్ళకు ఓ చెప్పలేని ధీమా. కొత్త వాళ్ళకే కాదు పాత తరం దర్శకులకూ ఎస్. గోపాల్ రెడ్డి ఓ దన్ను. అందుకే నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాటోగ్రాఫర్ గా అగ్రస్థానంలోనే ఉన్నారాయన. 1951 జూలై 4న జన్మించిన ఎస్. గోపాల్ రెడ్డి పుట్టిన రోజు ఇవాళ. ఆ సందర్భంగా ఆయన కెరీర్ ను ఓసారి పరిశీలిద్దాం.
కృష్ణాజిల్లాలో జన్మించిన ఎస్. గోపాల్ రెడ్డికి మొదటి నుండి చదువు పట్ల పెద్దంత ఆసక్తిలేదు. దాంతో యుక్తవయసులోనే తండ్రి సహకారంతో ఆయన స్నేహితుడు సి. నాగేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా చేరారు. ఆ తర్వాత ఆరేడు నెలల్లోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్. స్వామి చెంతకు చేరడంతో ఎస్. గోపాల్ రెడ్డి కెరీర్ గాడిలో పడింది. ఆయన దగ్గర తొమ్మిది సంవత్సరాలు శిష్యరికం చేసి, 1978లో కె.సి. శేఖర్ బాబు తీసిన ‘సంసార బంధం’తో సినిమాటోగ్రాఫర్ గా మారిపోయారు ఎస్. గోపాల్ రెడ్డి. తొలి చిత్రం పెద్దంత పేరు తెచ్చిపెట్టకపోయినా ఆ తర్వాత చేసిన ‘గూటిలోని రామచిలక’, ‘గోపాలరావుగారి అమ్మాయి’ సినిమాలు ఆయనకంటూ ఓ గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ప్రముఖ రచయిత జంధ్యాల తొలిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుని ‘ముద్దమందారం’ సినిమా తీస్తూ, ఎస్. గోపాల్ రెడ్డినే కెమెరామ్యాన్ గా పెట్టుకున్నారు. ఈ సినిమా నటీనటులకే కాదు సాంకేతిక నిపుణులకూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో తొలిసారి దర్శకత్వం వహించే యువకులందరికీ ఎస్. గోపాల్ రెడ్డి ఓ సెంటిమెంట్ గా మారిపోయారు. తన కెరీర్ లో పాతిక మంది కొత్త దర్శకుల చిత్రాలకు గోపాల్ రెడ్డి సేవలు అందించారు. రామ్ గోపాల్ వర్మ, బి. గోపాల్, ఎ.ఎం. రత్నం, దశరథ్, వి.ఎన్. ఆదిత్య, జి. రామ్మోహనరావు, పరుచూరి మురళీ, కొండా, మిలన్ లూద్రియా, శ్రీప్రియ, హేమంత్ మధుకర్ తదితరుల తొలి చిత్రాలకు ఆయనే పనిచేశారు. కేవలం తెలుగులోనే కాదు… హిందీలోనూ ఎస్. గోపాల్ రెడ్డి తన సత్తా చాటారు. ‘న్యాయం కావాలి’ చిత్రాన్ని హిందీలో ‘ముఝే ఇన్సాఫ్ చాహియే’గా పునర్ నిర్మిస్తూ, అట్లూరి పూర్ణ చంద్రరావు… ఎస్. గోపాల్ రెడ్డిని బాలీవుడ్ కు తీసుకెళ్ళారు. అక్కడ అమితాబ్ నటించిన మూడు చిత్రాలతో పాటు దాదాపు డజను సినిమాలకు గోపాల్ రెడ్డి వర్క్ చేశారు.

ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ‘ఆనంద భైరవి’, ‘క్షణక్షణం’ ‘హలో బ్రదర్’ చిత్రాలకు నంది అవార్డ్ అందుకున్నారు. విశేషం ఏమంటే 2011లో నంది అవార్డుల కమిటీ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కేవలం సినిమాటోగ్రఫీకే పరిమితం కాకుండా మిత్రుడు కె. ఎల్. నారాయణతో కలిసి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో ఆరు చిత్రాలు నిర్మించారు. త్వరలో మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా నిర్మించబోతున్నారు. నిజానికి చాలా కాలం క్రితమే బాలకృష్ణ హీరోగా జంధ్యాల దర్శకత్వంలో మిత్రులతో కలిసి ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాను ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు. అలా జంధ్యాల దర్శకత్వం వహించిన 11 చిత్రాలకు ఎస్. గోపాల్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. ఎం.వి. రఘు, రసూల్, విజయ్ కుమార్, సమీర్ రెడ్డి, స్వర్గీయ శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఎస్. గోపాల్ రెడ్డి దగ్గర శిష్యరికం చేసిన వారే. ఎస్. గోపాల్ రెడ్డి తనయుడు సందీప్ సైతం ఇప్పుడు తండ్రి బాటలోనే సాగుతున్నాడు. విశేషం ఏమంటే… దర్శకత్వంపై ఆసక్తి, అనురక్తి ఉన్న గోపాల్ రెడ్డి… రవితేజ హీరోగా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ మూవీని తెరకెక్కించారు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో మళ్ళీ దర్శకత్వం వైపుకు పోలేదు. సినిమాటోగ్రాఫర్ గా మాత్రం కొనసాగుతున్నారు. సినిమాటోగ్రఫీ రంగంలో డిజిటలైజేషన్ కారణంగా వచ్చిన సరికొత్త సాంకేతికతను సైతం అర్థం చేసుకుని ఈ తరం కెమెరామేన్లతోనూ పోటీ పడుతూ తన సత్తా చాటుతున్నారు ఎస్. గోపాల్ రెడ్డి. ఉత్తమాభిరుచిగల సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి సేవలు చిత్రసీమకు మరింత కాలం దక్కాలని కోరుకుందాం.