NTV Telugu Site icon

ప‌ద్నాలుగో సారి చిరుతో వెంకీ పోటీ!

మెగాస్టార్ చిరంజీవికి, విక్ట‌రీ వెంక‌టేశ్ కు మ‌ధ్య పోటీ అంటేనే విచిత్రంగా ఉంటుంది. వారిద్దరి మ‌ధ్య పోటీ ఏంటి అనీ జ‌నం అనుకుంటారు. కానీ, వారిద్దరూ ఇప్పటి దాకా బాక్సాఫీస్ బ‌రిలో 13 సార్లు పోటీ ప‌డ్డారు. ఒక‌సారి చిరంజీవిది పైచేయి అయితే మ‌రో సారి వెంక‌టేశ్ ది పైచేయి అయిన సంద‌ర్భాలున్నాయి. ఇప్పుడు ముచ్చట‌గా 14వ సారి చిరంజీవి సినిమాతో వెంక‌టేశ్ చిత్రం పోటీకి సై అంటోంది. చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ఈ ఏప్రిల్ 29న జ‌నం ముందుకు రానుంద‌ని ప్రక‌టించారు. ఇక వెంక‌టేశ్ కొత్త సినిమా ఎఫ్-3 చిరు సినిమా కంటే ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 28 అని విడుద‌ల కానుంది. ఒక్క రోజు తేడా కాదు, రెండు వారాల వ‌ర‌కు గ్యాప్ ఉన్నా పోటీ కిందే లెక్కిస్తూ ఉంటారు సినీజ‌నం. ఆ రీతిన చిరంజీవి, వెంక‌టేశ్ మ‌ధ్య ఇప్పటి దాకా 13 సార్లు పోటీ సాగింది. ఇప్పుడు మ‌రో మారు అదే రూటులో వారిద్ద‌రూ బాక్సాఫీస్ బ‌రిలో దూకుతున్నారు. చిరంజీవి సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించ‌గా, వెంక‌టేశ్ చిత్రంలో చిరంజీవి త‌మ్ముని కొడుకు వ‌రుణ్ తేజ్ సెకండ్ హీరో. ఇలా చిరంజీవి ఫ్యామిలీ హీరోతోనే క‌ల‌సి వెంక‌టేశ్, చిరు సినిమాకే పోటీగా వ‌స్తున్నారన్న మాట‌.

వెంక‌టేశ్ హీరోగా న‌టించిన తొలి సినిమా క‌లియుగ పాండ‌వులు విడుద‌లైన ఎనిమిది రోజుల‌కే చిరంజీవి చంటబ్బాయ్ బ‌రిలోకి దూకింది. క‌లియుగ పాండ‌వులు సూప‌ర్ హిట్ కాగా, చిరంజీవి చంట‌బ్బాయ్ ఫ్లాప్ అయింది. త‌రువాత అదే 1986లో ఏయ‌న్నార్, వెంక‌టేశ్ క‌ల‌సి న‌టించిన బ్రహ్మరుద్రులుతో చిరంజీవి ధైర్యవంతుడు ఢీ కొట్టాడు. రెండూ ప‌రాజ‌యాన్ని చ‌విచూశాయి. 1988 సంక్రాంతికి ఒకే రోజున చిరంజీవి మంచిదొంగ‌, వెంక‌టేశ్ ర‌క్తతిల‌కం విడుద‌లై విజ‌యాన్ని సాధించాయి. త‌రువాతి సంవ‌త్సరం అంటే 1989లో చిరంజీవి అత్తకు య‌ముడు- అమ్మాయికి మొగుడు ముందు వెంక‌టేశ్ ప్రేమ‌ నిల‌వ‌లేక పోయింది. అదే యేడాది జూన్ లో చిరంజీవి రుద్రనేత్ర, వెంక‌టేశ్ ధ్రువ‌న‌క్షత్రం 13 రోజుల గ్యాప్ తో ధీ కొన్నాయి. వెంక‌టేశ్ చిత్రమే కాసింత పై చేయి అనిపించుకుంది. 1991 జ‌న‌వ‌రిలో వెంక‌టేశ్ శ‌త్రువు, చిరంజీవి స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్ పై పైచేయిగా సాగింది. అదే యేడాది అక్టోబ‌ర్ లో వెంక‌టేశ్ క్షణ‌క్షణం, చిరంజీవి రౌడీ అల్లుడు పోటీ ప‌డ‌గా, రెండూ ఆక‌ట్టుకున్నా, చిరంజీవి సినిమా పెద్ద విజ‌యం సాధించింది. 1992 లో వెంక‌టేశ్ సుంద‌ర‌కాండ‌, చిరంజీవి ఆప‌ద్బాంధ‌వుడు ఢీ కొన‌గా, వెంక‌టేశ్ దే పై చేయిగా సాగింది. 1994లో చిరంజీవి, వెంక‌టేశ్ ఇద్దరూ పోలీస్ క‌థ‌ల‌తో ఎనిమిది రోజుల వ్య‌వ‌ధిలో పోటీ ప‌డ్డారు. ఆ చిత్రాలేవంటే చిరంజీవి ఎస్.పి.ప‌ర‌శురామ్, వెంక‌టేశ్ సూప‌ర్ పోలీస్ రెండూ అలరించ‌లేక పోయాయి. 1997లో చిరంజీవి హిట్ల‌ర్ వ‌చ్చిన ఆరు రోజుల‌కు వెంక‌టేశ్ చిన్నబ్బాయ్గా ప‌ల‌క‌రించారు. ఈ సారి వెంక‌టేశ్ ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. అదే యేడాది చిరంజీవి మాస్ట‌ర్ వ‌చ్చిన ఆరు రోజుల‌కు వెంక‌టేశ్ పెళ్లిచేసుకుందాం జ‌నం ముందు నిల‌చింది. వెంక‌టేశ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆక‌ట్టుకొని హిట్టు ప‌ట్టేశారు. చిరంజీవి త‌న‌దైన మార్కుతో తానూ పెద్ద విజ‌య‌మే మూటక‌ట్టుకున్నారు. 2000 సంవ‌త్సరం జ‌న‌వరిలో చిరంజీవి అన్నయ్య సూప‌ర్ హిట్ కాగా, వెంక‌టేశ్ క‌లిసుందాం రా ఆ యేడాదికే బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌చింది. ఇక 2001లో చిరంజీవి మృగ‌రాజు, వెంక‌టేశ్ దేవీపుత్రుడు పోటీ ప‌డ‌గా, రెండూ ఆక‌ట్టుకోలేక పోయాయి. ఆ త‌రువాత దాదాపు 21 సంవ‌త్స‌రాల‌కు చిరంజీవి,వెంక‌టేశ్ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్నారు. అందువ‌ల్ల సినీఫ్యాన్స్ లో ఆస‌క్తి నెల‌కొంది.

చిరంజీవితో కొర‌టాల శివ రూపొందించిన తొలి చిత్రం ఆచార్య‌. అందువ‌ల్ల ఈ సినిమాపై ఎంతో క్రేజ్ నెల‌కొంది. అలాగే ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అందునా ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్, పూజా హెగ్డే కూడా న‌టించ‌డంతో ఆచార్య‌కు మ‌రింత ఊపు ఉంది. ఇక వెంక‌టేశ్ ఎఫ్ 3 విష‌యానికి వ‌స్తే- ఈ చిత్రం గ‌తంలో సూప‌ర్ హిట్ అయిన ఎఫ్-2కు సీక్వెల్. న‌వ్వుల పువ్వులు పూయించ‌డంలో దిట్ట అనిపించుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. అందువ‌ల్ల ఈ సినిమా పై కూడా క్రేజ్ నెల‌కొంది. అయితే క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ లో చూస్తే చిరంజీవి ఆచార్య‌కే ఎక్కువ మార్కులు ప‌డేలా ఉన్నాయి. ఎందువ‌ల్ల‌నంటే, ఆచార్య‌లో కొత్త కాంబినేష‌న్ ప్ల‌స్ పాయింట్ గా క‌నిపిస్తోంది. అలాగ‌ని ఎఫ్-3ని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. ఎంత క్రేజీ చిత్రాన్న‌యినా, త‌న న‌వ్వుల‌తో మాయ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న డైరెక్ట‌ర్ ఎఫ్-3ని తెర‌కెక్కించారు. అందువల్ల‌ ఈ రెండు చిత్రాలు ఏ తీరున జ‌నాన్ని ఆక‌ట్టుకుంటాయో చూడాలి అన్న ఆస‌క్తి సినీఫ్యాన్స్ లో క‌లగ‌డం స‌హ‌జ‌మే!

గ‌తంలో చిరంజీవితో వెంక‌టేశ్ పోటీ ప‌డ్డ చిత్రాల జాబితా ఇక్కడ ఉంది. చూసుకోండి…
1.క‌లియుగ పాండ‌వులు (14-8-1986) – చంట‌బ్బాయ్ (22-8-1986)

  1. బ్ర‌హ్మ‌రుద్రులు (14-11-1986) – ధైర్య‌వంతుడు (27 – 11-1986)
  2. ర‌క్త‌తిల‌కం (14-1-1988) – మంచి దొంగ (14-1-1988)
  3. ప్రేమ (12-1-1989) – అత్త‌కు య‌ముడు – అమ్మాయికి మొగుడు (14-1-1989)
  4. ధ్రువ‌న‌క్షత్రం (29-6-1989) – రుద్రనేత్ర (16-6-1989)
  5. శ‌త్రువు (2-1-1991) – స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్ (9-1-1991)
  6. క్షణ‌క్షణం (9-10-1991) – రౌడీ అల్లుడు (18-10-1991)
  7. సుంద‌ర‌కాండ (2-10-1992) – ఆపద్బాంధ‌వుడు (9-10-1992)
  8. సూప‌ర్ పోలీస్ (23-6-1994) – ఎస్.పి. ప‌ర‌శురామ్ (15- 6- 1994)
  9. చిన్నబ్బాయ్ (10-1-1997) – హిట్లర్ (4-1-1997)
  10. పెళ్ళిచేసుకుందాం (9-10-1997) – మాస్టర్ (3 -10- 1997)
  11. క‌లిసుందాం రా (14-1-2000) – అన్నయ్య (7-1-2000)
  12. దేవీపుత్రుడు (14-1-2001) – మృగ‌రాజు (11-1-2001)