NTV Telugu Site icon

దాస‌రి కో-డైరెక్ట‌ర్ కు చిరు సాయం!

క‌రోనా క్రైసిస్ లో సినీప‌రిశ్ర‌మ కార్మికులు స‌హా ఆప‌ద‌లో ఉన్న ఎంద‌రినో చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి చిరు అందించిన ఆప‌త్కాల‌ సాయం చిత్రసీమలో చర్చనీయాంశం అయ్యింది. దాస‌రి నారాయ‌ణ‌రావు కో-డైరెక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ కి చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి అమ్మాయి చ‌దువుకు అవ‌స‌ర‌మైన ఫీజును వారు అందించారు. ఈ విషయాన్ని గురించి స్వయంగా ప్రభాకర్ తెలియచేశారు. ”నేను దాస‌రి గారి వ‌ద్ద ఎన్నో సంవత్సరాలు కో-డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాను. చిరంజీవి న‌టించిన ‘లంకేశ్వ‌రుడు’కీ వర్క్ చేశాను. కానీ ఇటీవ‌ల హెల్ప్ లైన్ అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించి, తీవ్రంగా నష్టపోయాను. దానిని థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ విడుదల చేయలేకపోయాను. దాంతో నా ఆర్థిక పరిస్థితి తారుమారైంది.

మా అబ్బాయికి సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్త‌యి రెండేళ్ల‌య్యింది. వాడి సర్టిఫికెట్లు డ‌బ్బు క‌ట్టి తేవాలి. పాప‌కు బీబీఏ ఫైన‌ల్ ఇయ‌ర్ కి వ‌చ్చింది. రూ. 2.5 ల‌క్ష‌ల ఫీజు క‌డితేనే ఎగ్జామ్ రాయనిస్తామని మేనేజ్ మెంట్ చెప్పింది. ఈ సమయంలో చిరంజీవి గారు సాయం చేస్తారేమోనని ఆయన్ని కలిశాను. 30ఏళ్ల క్రితం ‘లంకేశ్వ‌రుడు’కి ప‌ని చేసిన‌ప్పుడు ఎంత ప్రేమ‌గా చూసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమ‌ను క‌న‌బ‌రిచారు. వెంట‌నే స్పందించి ఫీజు ఏర్పాటు చేశారు. ఆ ఫీజును ఇన్ టైమ్ లో క‌ట్ట‌లేక‌పోవ‌డంతో హాల్ టికెట్ ఇవ్వ‌లేమ‌ని చెప్పిన కాలేజీ వర్గాలు, చిరంజీవి గారు సాయం చేశార‌ని అన‌గానే మనసు మార్చుకుని నాకు సహకరించారు. చిరంజీవి గారే కాకుండా నా క‌ష్టం విని రామ్ చ‌ర‌ణ్ గారు, వారి స్టాఫ్ కూడా ఎంతో సాయం చేశారు” అని అన్నారు.