ఏ మనిషీ ఎప్పుడూ ఒకేలా ఉండరు. మార్పు అనేది సహజం. జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ లోనూ ఆ తరహా మార్పును తెలుగు సినిమా రంగం చూస్తోంది. గతంలో ప్రకాశ్ రాజ్ చాలా అంశాలలో చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. ఆయన సినిమాల వేడుకలకు ఆయనే హాజరయ్యేవారు కాదు. నిమిషం కూడా వృధా చేయకుండా కాలంతో పరిగెత్తే వారు. ఎంతగా అంటే… కనీసం ఎలక్ట్రానిక్ మీడియాకు పండగల సందర్భంలో శుభాకాంక్షలు తెలపడానికి ఐదు, పది నిమిషాలు సమయం వెచ్చించడానికి ప్రకాశ్ రాజ్ ఇష్టపడేవారు కాదు. తాను వాటన్నింటికీ దూరం అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉండేది. బహుభాషలలో సినిమాలు చేస్తుండటంతో ఆయన బిజీని మీడియా వారూ అర్థం చేసుకుని మౌనంగా ఉండేవారు.
కానీ ఇప్పుడు ప్రకాశ్ రాజ్ లో ఎంతో మార్పు కనిపిస్తోందని సినీజనం చెబుతున్నారు. అడిగిందే తడవుగా ఆయన సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా చిన్న నిర్మాతలు, కొత్త నటీనటుల సినిమా ప్రచార చిత్రాలను విడుదల చేయడం, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొనడం చేస్తున్నారు. ఇలా గడిచిన పక్షం రోజుల్లో ఆయన మూడు కార్యక్రమాలకు హాజరయ్యారు. టీవీ నటుడు నందగోపాల్ హీరోగా పరిచయం అవుతున్న ‘నరసింహాపురం’ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్, ఈ నెల 26న ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ మూవీ ఫస్ట్ లుక్ ను, మోషన్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ఇక బుధవారం ‘భగత్ సింగ్ నగర్’ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ఏమంటే.. ఈ కార్యక్రమ నిర్వాహకులు అత్యుత్సాహంలో ‘మా’ ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విషయాన్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. అయితే తన కెరీర్ గురించి చెబితే ఓకే కానీ… ఇలా ‘మా’ ఎన్నికలను ఈ సందర్భంగా ప్రస్తావించడం బాగోలేదని వేదిక మీదే ప్రకాశ్ రాజ్ చెప్పేశారు.
నిజానికి ప్రకాశ్ రాజ్ లో ఈ మార్పుకు కారణం త్వరలో జరుగబోతున్న ‘మా’ ఎన్నికలే కదా! అని కొందరంటున్నారు. ఏదేమైనా ఓ పదవిని చేపట్టిన తర్వాత ఇలాంటి వేడుకల్లో పాల్గొనాల్సిన పరిస్థితి సినీ ప్రముఖులకు వస్తుంది. కానీ ‘మా’ ఎన్నికలకు ముందే ప్రకాశ్ రాజ్ వీటిల్లో పాల్గొని, ‘మా’ అభివృద్ధికి తగినంత సమయం తాను కేటాయించగలనని చెప్పకనే చెబుతున్నారు!!