NTV Telugu Site icon

‘రాజ్’ రోజులను గుర్తు చేసుకున్న బిపాషా బసు!

‘నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మేట్టయితే, దెయ్యం ఉందని నమ్మాల్సిందే’ అనేది ‘రాజ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్. ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున హిందీలో ‘రాజ్’ మూవీ విడుదలైంది. అప్పుడప్పుడే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన బిపాషా బసు కు ‘రాజ్’ మూవీ గట్టి పునాది వేసింది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి షూటింగ్ రోజుల్ని ఈ బెంగాలీ రసగుల్ల మరోసారి గుర్తు చేసుకుంది. అప్పటికి కేవలం రెండే సినిమాలు చేసిన బిపాషా బసు ‘రాజ్’లో సంజనా ధన్ రాజ్ పాత్రకు చక్కని న్యాయం చేకూర్చింది. ఈ హారర్ మూవీలో భర్త ప్రియురాలి ఆత్మ సంజనాను వెంటాడుతూ ఉంటుంది. దానిని నుండి ఆమె ఎలా తప్పించుకుందన్నదే ‘రాజ్’ కథ. విక్రమ్ భట్ దర్శకత్వంలో విశేష్‌ ఫిలిమ్స్, టిప్స్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

‘రాజ్’ మేకింగ్ రోజుల గురించి బిపాషా బసు మాట్లాడుతూ, ”ఈ సినిమా షూటింగ్ ను ఊటీలో చేశాం. ముఖ్యంగా రాత్రి సీన్స్ చాలా వరకూ అక్కడే చిత్రీకరించారు. చల్లటి చలి గాలిలో నైట్ నైటీ వేసుకుని, ఊటీలోని తోటల మధ్య నడవడం అంటే కాస్తంత భయంగానే ఉండేది. అలాంటి సమయంలో నా వెన్నులో వణుకు పుట్టేలా విక్రమ్ భట్ భయపెడుతూ ఉండేవాడు. నాకు ముందు చెప్పకుండా ఠక్కున్న పెద్ద శబ్దంతో ఘంటారావం చేయించేవాడు. అంతే… నా పై ప్రాణాలు పైనే పోయినట్టు అయిపోయేది. ఆ ఫీలింగ్స్ ను చాలా తెలివిగా కెమెరాతో కాప్చర్ చేయించేవాడు. ఇక షూటింగ్ లేని సమయాల్లో విక్రమ్ భట్ తో పాటు సరోజ్ ఖాన్, అశుతోష్‌ రాణా, డినో మోరియో కూర్చుని దెయ్యాల గురించి తమ అనుభవంలోకి వచ్చిన సంఘటనలను చెబుతూ ఉండేవారు. వాటిని వింటూ ఉంటే తెగ భయం వేసేది. అయితే… నిదానంగా భయపడటం అనేది అలవాటైపోయి, కెమెరా ముందు నటించడం సులువైంది. ఇక మేం నివాసం ఉండే బంగ్లా నిజానికి చాలా అందంగా, బాగుండేది కానీ దాన్ని సినిమాలో మాత్రం ఓ భయంకరమైన బంగ్లా గా చూపించారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ‘రాజ్’ కారణంగా నేను పొందాను” అని తెలిపింది. ‘రాజ్’ సినిమా విజయం తర్వాత బిసాషా బసు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు కమర్షియల్ గానూ ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకుంది. 2002లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన హిందీ చిత్రంగా ‘రాజ్’ నిలిచింది.