మనోరమ పేరు వింటే ఈ తరం వారికి ఆమె నటించిన ముసలి వేషాలే ముందుగా గుర్తుకు వస్తాయి. 1958 నుండి 2015 దాకా అంటే 57 సంవత్సరాలు చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ, దాదాపు 1500 చిత్రాలలో నటించారు మనోరమ. అన్ని చిత్రాలలో నటించిన నటి మరొకరు మనకు కానరారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి మెప్పించారు. కొన్ని చిత్రాలలో కథానాయికగానూ నటించారు. హాస్య పాత్రల్లో తనకు తానే సాటి అనిపించారు. కేరెక్టర్ రోల్స్ లోనూ భలేగా అభినయించారు. తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయప్రవేశం చేసి ఆకట్టుకున్నారు మనోరమ. దక్షిణాది భాషలన్నిటా మనోరమ నటించారు. అందుకే ఆమెను ‘అమ్మా’ అంటూ దక్షిణాది అన్ని సినిమా రంగాలు గౌరవించాయి.
మనోరమ అసలు పేరు గోపీశాంత. 1937 మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో ఆమె జన్మించారు. పేదరికంలో జన్మించిన మనోరమ 11 ఏళ్ళ దాకా స్కూల్ కు వెళ్ళారు. ఆమె తల్లి కొన్ని ఇళ్ళలో పనిచేస్తూ, ఆమెను చదివించేవారు. తల్లి అనారోగ్యం కారణంగా చదువు మానేసిన మనోరమ తమ ఊరు వచ్చిన ఓ డ్రామా కంపెనీలో చేరి, తొలుత ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ కంపెనీకి మనోరమ నటన నచ్చి, తమతో తీసుకుపోయారు. అప్పుడే ఆమె పేరు మనోరమగా మారింది. అలా నాటకాల్లో పలు వేషాలు వేసిన తరువాత, మనోరమ చిత్రసీమలో అడుగు పెట్టారు. ఆరంభంలో అంతగా అచ్చిరాలేదు. ఎందుకంటే ఆమె నాయికగా నటించిన చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో నటించారు. పాటల్లోనూ గ్రూప్ డాన్సర్ గానూ కనిపించారు. గాయనిగానూ సాగారు. తరువాత నటుడు ఎస్.ఎస్. రాజేంద్రన్, కవి కన్నదాసన్ ప్రోత్సాహంతో మనోరమ కొన్ని చిత్రాలలో వేషాలు సంపాదించగలిగారు. ఆ సినిమాలు ఇచ్చిన గుర్తింపుతో మరికొన్ని చిత్రాల్లో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. నాయికగా కంటే హాస్యనటిగానే తన కెరీర్ బాగుంటుందని భావించిన మనోరమ, అప్పటి నుంచీ కామెడీ రోల్స్ లో అలరించసాగారు. తన మేనేజర్ ఎస్.ఎమ్. రామనాథన్ ను కెరీర్ మొదట్లోనే ప్రేమించి పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు భూపతి. తరువాత భర్తతో విడిపోయినా, ఒక్కతే తన కొడుకును పెంచిపెద్ద చేసింది. భూపతి కూడా నటునిగా, గాయకునిగా సాగారు. చిన్నతనం నుంచీ చదువుకోవాలన్న ఆశ ఉన్నా, చదువుకోలేకపోయిన మనోరమకు చదువంటే ఎంతో ఇష్టం. తన తల్లి తనను డాక్టర్ గా చూడాలని కోరుకొనేదని, అయితే తాను యాక్టర్ ను అయ్యానని చెప్పేవారామె. తన మనవడు డాక్టర్ అయినందుకు ఎంతో సంతోషించేవారు మనోరమ.
మనోరమ నటనలో తనదైన బాణీ పలికిస్తూ సాగారు. ఆమె ఎంతోమంది నిర్మాతలకు, దర్శకులకు ఓ లక్కీ హ్యాండ్ గా మారారు. దాంతో తాము రూపొందించే చిత్రాలలో ఆమెను తప్పనిసరిగా ఎంచుకొనేవారు. మనోరమ టైమింగ్ అద్భుతమని మేటి నటులే కితాబు నిచ్చారు. ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా, ఇట్టే తనదైన అభినయంతో ఆకట్టుకొనేవారు మనోరమ. ప్రముఖ హాస్యనటుడు నగేశ్, మనోరమ జోడీ తమిళ జనాన్ని భలేగా అలరించారు. దాదాపు 50 చిత్రాలలో నగేశ్, మనోరమ నటించి ఆకట్టుకున్నారు. ఆరంభంలో కొన్ని తెలుగు చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించిన మనోరమ, తరువాతి రోజుల్లో తమిళంలో బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా మారారు. అందువల్ల తెలుగు చిత్రాలలో అంతగా నటించలేకపోయారు. కానీ, 1990ల నుండీ పలు తమిళ చిత్రాలు తెలుగులోకి అనువాదమయ్యాయి. వాటిలో మనోరమ నటనను చూసిన, తెలుగు సినీజనం కూడా ఆమెను మళ్ళీ మన సినిమాల్లో నటింపచేయసాగారు. అప్పటి నుంచీ అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తూనే జనం మదిని దోచుకున్నారు మనోరమ.
తెలుగులో మనోరమ “సంబరాల రాంబాబు, ప్రేమలు-పెళ్ళిళ్ళు, మొగుడా? పెళ్ళామా?, పెళ్ళికాని తండ్రి, శుభోదయం, ఇదే నా సవాల్, కాళి, ప్రేమకానుక, ఏది ధర్మం? ఏది న్యాయం?, ఇకనైనా మారండి, చిన్నారి దేవత, గురుశిష్యులు, పోలీస్ బ్రదర్స్, అక్కమొగుడు, కుంతీపుత్రుడు, అల్లరి ప్రియుడు, భైరవద్వీపం, రిక్షావోడు, సాంబయ్య, సింహరాశి, మనసున్న మారాజు, బావనచ్చాడు, నీ ప్రేమకై, నినుచూడక నేనుండలేను, విజయేంద్రవర్మ, నరసింహుడు, కృష్ణార్జున, అరుంధతి” మొదలైన చిత్రాలలో నటించారు. ఈ చిత్రాలన్నిటా మనోరమ తనదైన పంథాలో నటించి మెప్పించారు. అందుకే తెలుగువారి మనసుల్లో మనోరమ మరపురాని నటిగానే మిగిలారు.
‘పుదియ పాదై’ చిత్రంతో ఉత్తమ సహాయనటిగా మనోరమ నేషనల్ అవార్డును అందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుల స్వరకల్పనలో పలు చిత్రాల్లో మనోరమ గానం వినిపించింది. 2002లో మనోరమ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2013లో మనోరమ మానసిక ఆందోళనకు గురి అయ్యారు. అందరూ పిచ్చి పట్టిందన్నారు. తనకు పిచ్చిలేదంటూ రోదించారామె. కొన్నాళ్లు అనారోగ్య సమస్యలతో బాధపడిన మనోరమ 2015 అక్టోబర్ 10న తుదిశ్వాస విడిచారు. మనోరమ నేడు మనమధ్య లేకున్నా, ఆమె నటించిన పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆమె పూయించిన నవ్వులు మనకు కితకితలు పెట్టక మానవు.
(మే 26న నటి మనోరమ జయంతి)