NTV Telugu Site icon

వయ్యారాల కియారా!

రెండంటే రెండు తెలుగు సినిమాల్లో కనిపించినా, కుర్రకారు రెండు కళ్ళ నిండా నిలచిపోయింది అందాల భామ కియారా అద్వాణీ. అమ్మడి అందం చూసి కొందరు యంగ్ హేమామాలిని అన్నారు. మరికొందరు, సైరాబానును గుర్తు తెచ్చిందీ అని చెప్పారు. ఎవరు ఎలా పోల్చినా, కియారా అద్వాణీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’లో కియారా అభినయం చూసిన యువకులెవ్వరూ ఆమెను మరచిపోలేరు. ఆ చిత్రంలోని కియారా అందాన్ని తలచుకుంటే చాలు కుర్రాళ్ళలో విద్యుత్ ప్రవహించవలసిందే! ఒకవేళ కరెంట్ అంతగా లేనివారికి సైతం కియారా అందాన్ని స్మరిస్తే చాలు ఉరకలు వేయక మానరు. అంతలా అలరించిన కియారా ‘కబీర్ సింగ్’తో కుర్రకారు మనసులను మరింతగా దోచుకుంది. ఈ అమ్మడి అందాల అభినయం కోసం బాలీవుడ్ పరుగులు తీస్తోంది. కియారా మాత్రం తనకు నచ్చిన చిత్రాలనే ఎంపిక చేసుకుంటూ సాగుతోంది.

కియారా అసలు పేరు అలియా అద్వాణీ. అప్పటికే చిత్రసీమలో అలియా భట్ ఉండడం వల్ల ఓ సారి సల్మాన్ ఖాన్ సూచనతో పేరు మార్చుకుంది. ఇక ‘కియారా’ పేరు పెట్టుకోవడానికీ ఓ కథ ఉంది. ‘అంజానా అంజానీ’ చిత్రంలో ప్రియాంక చోప్రా కేరెక్టర్ పేరు కియారా. ఆ సినిమా చూశాక ఆ పేరు నచ్చడంతో అలియాను తీసేసి ‘కియారా’ను తగిలించుకున్నానని అంటోంది అమ్మడు. కబీర్ సదానంద్ తెరకెక్కించిన ‘ఫగ్లీ’ చిత్రం ద్వారా కియారా పరిచయం అయింది. తరువాత ‘ఎమ్.ఎస్.ధోనీ’ చిత్రంలో హీరో భార్యగా నటించి ఆకట్టుకుంది. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు జనం ముందు నిలచింది కియారా. వస్తూనే మహేశ్ బాబు వంటి టాప్ స్టార్ మూవీలో నటించడం వల్ల కియారాకు తెలుగునాట మంచి గుర్తింపు లభించింది. అది విడుదలయిన కొద్ది రోజులకే ‘లస్ట్ స్టోరీస్’లో కియారా కిర్రెక్కించింది. దాంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ‘వినయ విధేయ రామా’లో రామ్ చరణ్ కు జోడీగా నటించింది. ఈ సినిమాలోనూ అమ్మడి అందం అదరహో అనిపించింది. తెలుగులో విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’లో కియారా అందాల అభినయం అందరినీ అలరించింది. దాంతో కియారా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించేసింది. నెట్ ఫ్లిక్స్ ‘గిల్టీ’లోనూ కియారా ఆకట్టుకొనే నటనను ప్రదర్శించింది. అవకాశాలు వెల్లువెత్తుతున్నా కియారా ఎందుకనో ఆచి తూచి అడుగులేస్తూ తన మనసుకు నచ్చిన చిత్రాలనే ఎంపిక చేసుకుంటోంది.

సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి కియారా నటించిన ‘షేర్ షా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘భూల్ భులయ్యా -2’, ‘జగ్ జఘ్ జియో’ , ‘మిస్టర్ లేలే’ చిత్రాలలో నటిస్తోంది. ‘షేర్ షా’ హీరో సిద్ధార్థ్ మల్‌హోత్రాతో కియారా డేటింగ్ చేస్తోందని విశేషంగా వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘పెళ్ళయ్యే దాకా సింగిల్ గానే ఉంటాను’ అని చెప్పి అందరినీ ఆకట్టుకుంది కియారా. ఏది ఏమైనా కియారా అందం నవతరం అబ్బాయిలకు బంధాలు వేస్తోంది. ఆమె మరిన్ని చిత్రాలతో మరింతగా అలరిస్తుందని ఆశిద్దాం.