NTV Telugu Site icon

‘మనసా నమః’ దర్శకుడితో శర్వానంద్ మూవీ!

ఇటీవల విడుదలైన శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై శర్వానంద్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌ ద్విభాషా చిత్రంలో శర్వానంద్ రీతూవర్మతో కలిసి నటిస్తున్నాడు. అలానే అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’లోనూ చేస్తున్నాడు. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఈ రెండూ కాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ మూవీ చేయడానికీ శర్వానంద్ కమిట్ అయ్యాడు.
వీటి కథ ఇలా ఉంటే… తాజాగా శర్వా ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్ ‘మనసా నమః’తో దర్శకుడు దీపక్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. పలువురు యంగ్ హీరోస్ అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ కు దీపక్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చిందని, దాన్ని శర్వానంద్ హీరోగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. శర్వానంద్ సైతం కథ విని తన అంగీకారాన్ని తెలిపాడట. ప్రస్తుతం ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి కాగానే ఇది పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుండి ఇప్పటికే కొరటాల శివ, సుజిత్, రాధాకృష్ణ వంటి దర్శకులుగా పరిచయం అయ్యారు. ఆ జాబితాలో త్వరలో దీపిక్ రెడ్డి పేరు సైతం చేరబోతోంది.