YS Sharmila Fires On CM KCR and KTR: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. తన యాత్రలో భాగంగా మోమిన్‌పేట మండల కేంద్రంలో అడుగుపెట్టిన షర్మిల.. కేసీఆర్‌తో ఒక్కరైనా లబ్ది పొందారా? ఒక్క వర్గానికి అయినా లాభం జరిగిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంటికో ఉద్యోగం.. లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇచ్చారా..? అని నిలదీశారు. ఆత్మ గౌరవం ఇల్లు అని చెప్పి మోసం చేశారని, ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. దళితులకూ 3 ఎకరాల భూమి ఇస్తానన్న హామీని తుంగలో తొక్కేశారన్నారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకొని మోసగాడు కేసీఆర్ అని చెప్పిన షర్మిల.. అరచేతిలో వైకుంఠం చూపించారని ధ్వజమెత్తారు. డిగ్రీలు, పిజిలు చదివి హమాలి పని చేసుకోమ్మని మంత్రి చెప్తాడని, అలా చెప్పడానికి సిగ్గుండాలని అన్నారు. కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఇప్పటివరకూ 17 వేలు మాత్రమే ఇచ్చారన్నారు.
ఉద్యోగాలు కావాలని యువత అడిగితే.. కేసీఆర్ ఏమో మందు ఇస్తున్నాడని షర్మిల పేర్కొన్నారు. మద్యం అమ్మకాలతో రాష్ట్రం నడిపే పరిస్థితి వచ్చిందన్నారు. బడి, గుడి కన్నా ఈ రాష్ట్రంలో మద్యం షాపులే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది బంగారు తెలంగాణ కాదని.. బార్ల, బీర్ల తెలంగాణ అని విరుచుకుపడ్డారు. వ్యవసాయాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారని, కౌలు రైతులను ఆగం చేశారని అన్నారు. పంట నష్టం జరిగితే కనీసం పరిహారం ఇచ్చే దిక్కు లేదన్న షర్మిల.. ముష్టి 5 వేలు రైతు బందు ఇచ్చి, రైతులను కోటీశ్వరులు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైరయ్యారు. ఈ దరిద్రం ఇక్కడితో చాలదని, ఇక దొర దేశాలు ఏలబోతాడట అంటూ ఎద్దేవా చేశారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ.. పిన్నమ్మ కి బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నట్టు ఉందని సెటైర్లు వేశారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని.. 4 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి కమీషన్ల రూపంలో డబ్బులు తినేశారని.. మెగా కృష్ణారెడ్డికి దోచి పెట్టారని ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా.. ప్రతి పక్షాలు నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం అన్నారు. మెగా కృష్ణా రెడ్డికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అమ్ముడుపోయాయని.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అది తెరాసకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో గెలిచినవాళ్లు.. తెరాసలో చేరి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక బీజేపీ ఒక మత పిచ్చి పార్టీ అని.. మతం పేరు చెప్పి చలి కాచుకుంటోందని ఫైర్ అయ్యారు. రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పి బీజేపీ మోసి చేసిందన్నారు. విభజన సమస్యలు సైతం బీజేపీ ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానని.. వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తెస్తానని చెప్పారు. అప్పట్లో వైఎస్సార్ తెచ్చిన ప్రతీ పథకాన్ని.. రాజన్న బిడ్డ అయిన తాను అయిన తిరిగి నిలబెడతానంది. ఇదే సమయంలో వీఆర్ఏల ఆందోళనకు మద్దతు తెలిపారు. వీఆర్ఏలు గత 60 రోజులుగా సమ్మె చేస్తూనే ఉన్నారని.. కేటీఆర్ చర్చలకు అని పిలిచి తెగేదాకా లాగొద్దని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటికే 30 మంది ఆత్మహత్య చేసుకున్నారని.. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారని నిలదీశారు. అసలు వీఆర్ఏల సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ది మీకు లేదంటూ ఎద్దేవా చేశారు. ఇది దొంగల రాజ్యమా దోపిడీ రాజ్యమా అని విరుచుకుపడిన షర్మిల.. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
