పాలకులు ఏదైనా మంచి పని చేస్తే అది కొన్నేళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోవాలి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ అలాంటిదే. గుట్టపై నూతనంగా వెలసిన ఆలయ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ మహాకార్యాన్ని నిజం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కూడా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
ఇప్పుడు యాదాద్రి అందాలను చూస్తే మైమరచిపోకుండా ఉండలేరు. అంత రమ్యంగా తీర్చిదిద్దారు యాదగిరి నరసింహుని సన్నిధిని. ఎక్కడా రాజీ పడకుండా, ఏలాంటి తొందర, ఆతృ లేకుంగా కావాల్సినంత సమయం తీసుకుని దీక్షగా తీర్చి దిద్దారు. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి అన్ని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆలయ గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజ స్థంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణీ, యాగశాల ఇలా దేనిని చూసినా అడుగడుగునా ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడుతుంది.
యాదగిరిగుట్ట గొప్ప సనాతన ఆలయం. దేశ విదేశాల్లో స్వామి వారికి లక్షలాది మంది భక్తులున్నారు. ప్రతి నిత్యం వేలాది మంది నరసింహుని దర్శించి మొక్కులు చెల్లిస్తారు. పునరుద్ధరణ తరువాత యాదాద్రి భక్తుల సంఖ్య ఇప్పటికన్నా రెట్టింపు అవుతుందని అంచనా. కనుక దైవ దర్శనం నుంచి వసతి సౌకర్యం, పుణ్య స్నానాలు, తలనీలాల సమర్పణ..ఇలా అన్ని విషయాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు.
రాతి శిలలను శిల్పులు అధ్భుత కళాకండాలుగా మలిచారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారు. 560 మంది శిల్పులు ఏళ్ల నాటి కష్టం ఫలించి అధ్భుత ఆకారాలతో కూడిన ఈ ప్రాకారాలు సిద్ధమయ్యాయి. వందకు వంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్ధడం యాదాద్రిలోనే సాధ్యమయింది. ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీ నర్సింహస్వామి చరిత్ర, స్థలపురాణం ప్రస్పుటించే విధంగా తైల వర్ణ చిత్రాలు ఏర్పాటు చేశారు.
విశిష్టాలయానికి ప్రతిదినం ప్రముఖులు వస్తూ వుంటారు. ప్రత్యేక దినాలలో వీఐపీలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అందుకే సకల సౌకర్యాలతో కూడిన 15 వివిఐపి కాటేజీలతో ప్రెసిడెన్షియల్ సూట్ ను నిర్మించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వారు వచ్చినా వారికి సౌకర్యవంతంగా వుండేట్లు ఈ ప్రెసిడెన్షియల్ సూట్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2016 ఏప్రిల్‌లో అప్పటి వరకు ఉన్న ఈ గుట్ట గుడితో పాటు దేవాలయానికి అనుసంధానమైన అన్ని నిర్మాణాలను తొలగించారు. అలాగే గుట్ట చుట్టూ ఆనుకుని ఉన్న అన్ని ప్రైవేటు స్థలాలనూ, గృహ నిర్మాణాలను కూడా తొలగించారు. పూర్తి నల్లరాతితో యాదాద్రి పునర్నిర్మాణం జరిగింది. తెలంగాణా తిరుపతిగా పిలుచుకునే ఈ యాదగిరిగుట్ట ప్రపంచవ్యాప్తంగా యాదాద్రిగా నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే యాదాద్రి కొత్త వెలుగును చూసేందుకు సెలవు దినాలలో సందర్శకులు పోటెత్తుతున్నారు.
యావత్ దేశం అబ్బురపడేలా యాదాద్రిని మలచేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు చేసింది. వంద కోట్లతో 1900 ఎకరాల భూమిని సేకరించింది. ఆలయ అభివృద్ధికి రూ.509 కోట్లు, టెంపుల్ సిటీ అభివృద్ధికి రూ. 1325 కోట్లు ఖర్చు చేసింది. ఆలయ నిర్మాణంతో పాటు టెంపుల్ సిటీ అభివృద్ధి, మంచినీటి వసతి, కాటేజీల నిర్మాణం, రహదారులు, సరస్సులు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, నిత్యాన్నదాన సత్రాలు, కల్యాణ మండపాలు, వేద పాఠశాల, శిల్పనిర్మాణ సంస్థ ఏర్పాటు వంటివి ఏర్పాటయ్యాయి. యాదాద్రిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు సమీపంలో నాలుగు సరస్సులను అభివృద్ధి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
దాదాపు ఏడేళ్ల క్రితం యాదాద్రి అభివృద్ధి అంశం తెరమీదకు వచ్చింద. నాటి నుంచి ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి పనులు ప్రారంభించినా ముందు అక్కడి భూముల ధరలు పెరుగుతాయి. పైగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో యాదగిరిగుట్ట ప్రాంతంలో ఎన్నో స్థిరాస్థి సంస్థలు వెలిశాయి.
163వ నంబరు జాతీయ రహదారిలో 99 కిలో మీటర్ల పొడవునా యాదాద్రి-వరంగల్ మార్గం ఉంది. యాదాద్రి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపటంతో ఆ ప్రాంత గ్రామాలకు మహర్దశ పట్టింది. మున్ముందు యాదాద్రి నరసింహుడు కూడా తిరుమల వెంకన్నలా ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులను తన చెంతకు రప్పించుకుంటారనటంలో సందేహం లేదు.
