యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా నేడు 7వ రోజు పంచకుండాత్మక యాగాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం శాంతి పాఠం, చతు:స్థానార్చన, మూలమంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనితో పాటు సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మూలమంత్ర హావనములు, చతుఃస్థానర్చనలు, షోడ కళాన్యాస హోమములు, పంచశయ్యదివాసం, నిత్య లఘు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు యాదాద్రి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ వైభవోపేతంగా నిర్వహించనున్నారు.
దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నేడు రాత్రికి సీఎం కేసీఆర్ దంపతులు కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకోనున్నారు. ప్రధానాలయం పునర్నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పించారు. నేటితో బాలాలయంలో భక్తులకు దర్శనాలు ముగియనున్నాయి. రేపు యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ ఉదయం 11:55 గంటల అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు రూ.1280 కోట్లతో సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేశారు.
