NTV Telugu Site icon

Yadadri Yagam: శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. 1200కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్‌ 11 దసరా రోజున ప్రారంభమైన పనులు ఐదేళ్లలోనే పూర్తయ్యాయి. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆలయాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదా వేశారు.

ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహణ వుంటుందని అంటున్నారు. మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిర్ణయించినట్లుగానే మార్చి 28న ప్రారంభం కానుంది. మహాకుంభ సంప్రోక్షణ చేపట్టిన తర్వాత ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తారు. ప్రస్తుతం నారసింహుడు కొలువై ఉన్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తారు. ఈ నెలాఖరులో ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన జరుగుతుంది. చుట్టూ పచ్చదనం, కళా నైపుణ్యం, ఆధ్యాత్మిక వైభవంతో అపర వైకుంఠాన్ని తలపించేలా యాదాద్రి దివ్యక్షేత్రం ప్రారంభం ఎప్పుడెప్పుడా అని భక్తకోటి వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది.

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామిజీ సూచనలతో.. మార్చి 28న యాదాద్రి పునర్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రిలో 10వేల మంది రుత్వికులతో సుదర్శన యాగం నిర్వహించనున్నారు.చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపంగా వాస్తు శిల్పులు, స్తపతులు కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చూసిన ప్రముఖులు కేసీఆర్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.