తెలంగాణలో ఆడపిల్ల పుడితే అదృష్ట లక్ష్మి పుట్టింది అనే సంబర పడే రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడపిల్లలందరికి మేనమామ అయ్యాడు కేసీఆర్ అని, మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కుల, మత తారతమ్యం లేకుండా 9 వేల కోట్లతో కళ్యాణ లక్ష్మీ పథకాన్ని తీసుకువచ్చి, 10 లక్షల మంది ఆడ పిల్లలకు పెళ్లికి సాయం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, అప్పుడే పుట్టిన శిశువుల కోసం ఇప్పటి వరకు 11 లక్షల కేసీఆర్ కిట్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఆయన అన్నారు.
మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామని, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసేందుకు వీ-హబ్ ఏర్పాటు చేసామని ఆయన వెల్లడించారు. నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పటాన్‌చెరులో 350 పడకల ఆసుపత్రి కి నిధులు కేటాయించామని, తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కో మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా మహిళా దినోత్సవ కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని మొట్టమొదటిసారిగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ఈ బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించారని ఆయన పేర్కొన్నారు.
