ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యం అందడం సామాన్యుడికి భారంగా మారింది. పెద్ద ఆసుపత్రుల్లో ఇష్టానుసారమైన బిల్లులతో జనాన్ని దోచుకుంటుంటే… భారీ ఖర్చులకు భయపడి చిన్న ఆసుపత్రులు, కాలనీ క్లినిక్‌లకు వెళ్తే అక్కడ నకిలీ వైద్యుల బెడద ప్రాణాల మీదకు తెస్తోంది. కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరానికి మించి పరీక్షలు రాసి జేబులకు చిల్లులు పెడుతుంటే, చిన్న క్లినిక్‌లలో అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా చలామణి అవుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక్కడ మోసపోయిన బాధితులు విధిలేని పరిస్థితుల్లో మళ్లీ కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
టీజీఎంసీ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి నకిలీ దందాలు
వరంగల్ నగరంలో అసలు వైద్యుల బోర్డుల చాటున నకిలీ వైద్యులు సాగిస్తున్న గుట్టు రట్టును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) సభ్యుల ఆకస్మిక తనిఖీలు బట్టబయలు చేశాయి. హన్మకొండలోని రెడ్డి కాలనీ, రాయపుర, ఇందిరానగర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. క్లినిక్ బయట క్వాలిఫైడ్ డాక్టర్ల పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లు బోర్డులపై ప్రదర్శిస్తూ.. లోపల మాత్రం ఎలాంటి అర్హత లేని వ్యక్తులతో వైద్యం అందిస్తున్న బండారం బయటపడింది.
శ్రీలక్ష్మి, ప్రణతి క్లినిక్‌లలో బయటపడిన మోసాలు
హన్మకొండ ఇందిరనగర్‌లోని శ్రీలక్ష్మి క్లినిక్ బయట డా. బి. మోహన కృష్ణ (MD జనరల్ మెడిసిన్), డా. ఎన్. అవినాష్ (MBBS) పేర్లతో బోర్డు ఉండగా, లోపల ‘ఆర్.కె. రావు’ అనే 50–55 ఏళ్ల వ్యక్తి తాను హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్‌నంటూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తేలింది. ఆరా తీస్తే ఆయన గతంలో హైదరాబాద్‌లో ఒక డాక్టర్ వద్ద కాంపౌండర్‌గా పనిచేసినట్లు బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. అలాగే ఇదే ప్రాంతంలోని ప్రణతి క్లినిక్‌కు డా. కె. సుష్మిత పేరుతో డి.ఎం.హెచ్.ఓ. అనుమతి ఉండగా, దాని గడువు ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆ డాక్టర్ అక్కడ అందుబాటులో లేకపోగా, ఫార్మసీ విద్య అభ్యసించిన ఎన్. సందీప్ అనే వ్యక్తే తానే వైద్యుడినంటూ రోగులకు చికిత్సలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అధిక మోతాదులో ఇంజెక్షన్లు.. అనుమతులు లేని దందా
పక్కనే ఉన్న రెడ్డి కాలనీ, ఇందిరనగర్ పరిసరాల్లోని సిద్ధార్థ క్లినిక్‌తో పాటు మరో క్లినిక్‌పై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తూ.. స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను విచక్షణారహితంగా ఇస్తున్న నిర్వాహకుడు వేణుపై టీజీఎంసీ బృందం ‘టిఎస్ఎంపిఆర్ యాక్ట్’ (TSMPR Act) ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసింది. వరంగల్ నగరంలో ఇలా అనుమతులు లేకుండా దాదాపు 50 నుంచి 60 క్లినిక్‌లు నడుస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రాణాల మీదకు తెస్తున్న నకిలీ వైద్యం
అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా మారువేషంలో తిరుగుతూ చికిత్స అందించడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అవగాహన లేకుండా స్టెరాయిడ్లు, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ఇతర అవయవాలపై తీవ్ర దుష్ప్రభావాలు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఆసుపత్రి బయట పెద్ద పెద్ద బోర్డులు, ప్రముఖుల పేర్లు ఉన్నంత మాత్రాన నమ్మకుండా.. చికిత్స అందిస్తున్న వ్యక్తి నిజమైన అర్హతలను, రిజిస్ట్రేషన్‌ను రోగులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని స్థానిక వైద్యులు హెచ్చరిస్తున్నారు.

