Site icon NTV Telugu

”దళిత బంధు” ఓట్ల కోసమే : రాములమ్మ సెటైర్లు..

దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్‌ అయ్యారు. ”ముఖ్యమంత్రిగారు దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయం… అయితే, గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు లాంటి అనేక హామీలు తుంగలోకి తొక్కడం… దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా ఊడపీకడం వంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు లేవు. అట్లనే, దళిత బంధు పథకానికి కేవలం రూ.1200 కోట్లు కేటాయించి, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పని తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ విషయంలో… 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పలేదని తప్పించుకున్న ఘనత ఈ సీఎం గారిది. ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్ళు మొత్తం డిమాండ్‌కు చాలినన్ని కట్టలేని ఈ ప్రభుత్వం వెళుతున్న వేగానికి మరో 60 ఏళ్ళు పట్టేట్టుంది. ఇప్పుడు దళిత బంధు పథకానికి కూడా వీరి కేటాయింపులను బట్టి చూస్తే 160 సంవత్సరాలు పట్టవచ్చు. ఇక హుజురాబాద్ ఎన్నికల కోసం పైలెట్ ప్రాజెక్ట్ పెట్టినం… ఇది పక్కాగా ఎన్నికల్లో ఓట్ల కోసమే చేస్తున్నాం… అన్న సీఎం గారు… ఇది ఓట్ల పథకం అయినప్పుడు, ఆ నియోజకవర్గంలోని మిగతా కులాలకు చెందిన సుమారు 70 వేల పైచిలుకు కుటుంబాలకు కూడా ఇలా 10 లక్షల చొప్పున నిధుల కేటాయింపు ఎందుకు చెయ్యలేదు? వారు మీ ప్రజలు కాదా? వారివి ఓట్లు కావా? ఆయా వర్గాల ప్రజలందరూ ఈ విషయమై తమ 10 లక్షలు తమకు ఇచ్చేంతవరకూ గ్రామ గ్రామానా టీఆరెస్ నేతలను నిలదీయాలి.”అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు.

Exit mobile version