Site icon NTV Telugu

50 వేల ఉద్యోగాల ప్రకటన పెద్ద కుట్ర : విజయశాంతి

KCR Vijayashanthi

తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై బీజేపీ నేత విజయశాంతి తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. తెలంగాణలో 50 వేల ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తామంటూ ఎప్పుడో 7 నెలల కిందట ప్రకటించిన కేసీఆర్ కు…. ఉన్నట్టుండి నిరుద్యోగులపై ప్రేమ పుట్టి వెంటనే కొలువుల భర్తీకి చర్యలంటూ నేడు మళ్ళీ ప్రకటన చేశారనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటుండదని ఫైర్‌ అయ్యారు. ఉద్యోగాలంటూ కేసీఆర్ ఎప్పుడు ప్రకటించినా ఆ వెనుక ఎంతో పకడ్బందీ కుట్ర ఉంటుందని… ఏడు నెలల కిందట చేసిన ఆ 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనను నాన్చి నాన్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అస్త్రంగా వాడుకున్నారని మండిపడ్డారు.

read also : మహిళలకు మరోసారి షాక్‌.. పెరిగిన పసిడి ధరలు

తమ అభ్యర్థులు గెలిచాక… ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఉఫ్‌మని ఊదేశారని… ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ భర్తీ అంటూ బాజాలు మోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మూడేళ్ళుగా జాబ్ నోటిఫికేషన్లు లేవని… అంతకు ముందు కూడా చిన్నా చితకా నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల భర్తీకి పెద్ద నోటిఫికేషన్లు ఏవీ రాలేదన్నారు. ఈ క్రమంలో ఎందరో నిరుద్యోగులకు వయో పరిమితి దాటిపోయి… తమ కలల్ని సాకారం చేసుకునే అవకాశానికి శాశ్వతంగా దూరమైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ కు నిజంగా ఉద్యోగాల భర్తీపై అంత చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితి రానిచ్చేవారు కాదని… నిజానికి లక్షా 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలుంటే… అందులో ఇప్పుడు తొలి దశలో 50 వేల ఉద్యోగాల భర్తీ అంటున్నారని మండిపడ్డారు. దీనికే ఏళ్ళకేళ్ళ సమయం తీసుకుంటున్నారని… ఇక మిగిలిన లక్షా 40 వేల పైచిలుకు పోస్టుల భర్తీ కావాలంటే అందుకు ఆయన కొడుకు, మనుమలు, మునిమనుమలు కూడా సీఎంలు అయ్యే వరకూ ఎదురు చూడాలేమో అంటూ విజయశాంతి చురకలు అంటించారు.

Exit mobile version