NTV Telugu Site icon

Uttam Kumar Reddy: మోదీ విధానాలతో దేశ భద్రతకు ముప్పు

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy Fires On PM Narendra Modi Over Agnipath: కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ విధానాలతో దేశ భద్రతకు ముప్పు ఉందని, మోదీ నిర్ణయాలు త్రివిధ దళాలను బలహీన పరుస్తున్నాయని మండిపడ్డారు. అగ్నిపథ్ ఈ పథకం ద్వారా త్రివిధ దళాల్లో సైన్యం బలగాల్ని తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఏడాదికి 60 వేల మందిని ఆర్మీల్‌లో రిక్రూట్ చేసుకునేవారని, కానీ ఆ రిక్రూట్‌మెంట్‌ని ఇప్పుడు 60 వేల నుంచి 40 వేలకు తగ్గించారని విమర్శించారు.

ఈ అగ్నిపథ్‌ పథకం ద్వారా ఆర్మీలో 40 వేలు, నేవీలో 3 వేలు, ఎయిర్‌ఫోర్స్‌లో 3 వేల పోస్టులు మాత్రమే ఇస్తున్నారని ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఈ పథకం ఆర్మీ స్కిల్స్ చంపేసేలా ఉందని దుయ్యబట్టారు. దేశ భద్రతకు కావాల్సిన సైనిక బలానికి అనుగుణంగా రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వల్లే.. ఈ అగ్నిపథ్ స్కీమ్‌లో రిజిష్టర్ చేసుకుంటున్నారని తెలిపారు. నాణ్యత శిక్షణలో రాజీపడొద్దని, పాత విధానంలోనే సైనిక రిక్రూట్‌మెంట్ చేపట్టాలన్నారు. చైనా సరిహద్దు చర్యలను మోదీ పట్టించుకోకపోవడం దురదృష్టమని, సరిహద్దుల్లో చైనా గ్రామాలు నిర్మిస్తున్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.