Uttam Kumar Reddy Comments On CM KCR Over Tribal Reservation: గిరిజన బంధు, ఎస్టీ రిజర్వేషన్ కోటా పెంపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేవలం మునుగోడు ఉప ఎన్నికల కోసం ఎస్టీలను మోసం చేసేందుకే గిరిజన బంధుని సీఎం ప్రకటించారని వ్యాఖ్యానించారు. ఎస్టీ మీద కేసీఆర్‌కు నిజంగా అంత ప్రేమ ఉంటే.. 2014లోనే ఎస్టీ కోటా పెంపుపై ఎందుకు జీవో జారీ చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగ, విద్యలో ఎస్టీ కోటా పెంపు మీద కేసీఆర్ నకిలీ హామీలు ఇస్తున్నారన్నారు. ప్రస్తుతమున్న 6 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడం, గిరిజిన బంధు అమలు చేయడం.. ఎండమావి లాంటివని మండిపడ్డారు.
ఎస్టీ కోటాను పెంచాలని 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, తాను కూడా గతంలో గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాంతానికి పెంచాలన్న అంశాన్న పార్లమెంట్‌లో చాలాసార్లు లేవనెత్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. ఈ ఏడాది ఆగస్టు 22న రాష్ట్రపతి ద్రౌపదికి సైతం తాను వినతిపత్రాన్ని అందించినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా.. ఎస్టీ కోటా పెంపుపై జీవో జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారని, ఆయన ప్రకటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టి, లబ్ది పొందడం కోసమే కేసీఆర్ ఈ ప్రకటన చేశారని మరోసారి ఆరోపణలు గుప్పించారు. ఎస్టీలపై కేసీఆర్‌కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
ఇదిలావుండగా.. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలను క్వీన్ స్వీప్ చేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే దళితుల కోసం దళిబ బంధు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, ఇప్పుడు గిరిజన బంధు పథకాల్ని అమలు చేసేందుకు కృషి చేస్తోంది. అలాగే.. ఎస్టీలకు ఆరు నుంచి పది శాతానికి రిజర్వేషన్లు పెంచాలని చూస్తున్నారు. భూమి లేని ఎస్టీలకు గిరిజన బంధు, గిరిజనులకు పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు.
