NTV Telugu Site icon

Komatireddy RajGopal Reddy: రాహుల్‌ గాంధీ సందేశం.. తగ్గేదే లే అంటున్న రాజగోపాల్‌రెడ్డి..!

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌ ఇంకా హాట్‌ టాపిక్‌గానే కొనసాగుతోంది.. పూటకో మలుపు.. గంటకో ట్విస్ట్‌ అనే తరహాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజీనామా చేసే పార్టీలోకి రావాలని బీజేపీ కండీషన్‌ పెడితే.. అసలు రాజగోపాల్‌రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా లేదు.. రాష్ట్ర నేతలతో పాటు.. కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగినా.. రాజగోపాల్‌రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గినట్టుగా కనిపించడంలేదు.. రాజగోపాల్‌రెడ్డితో వరుసగా సమావేశాలు నిర్వహించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వంశీచంద్‌రెడ్డి.. ఢిల్లీకి రావాలంటూ రాహుల్‌ గాంధీ పంపిన సందేశాన్ని చేరవేశారు.. ఇవాళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కూడా రాజగోపాల్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.. మొత్తంగా రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌ ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే, నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత తన రాజీనామాపై రాజగోపాల్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. రేపటి నుంచి మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నారు రాజగోపాల్‌రెడ్డి.. తన పర్యటనలో కీలకంగా భావిస్తున్న గ్రామాలను సైతం టచ్‌ చేయనున్నారు..

ఇప్పటికే తన నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన నేతలు, పార్టీ శ్రేణులు, తన అభిమానులతో సమావేశాలు నిర్వహించిన రాజగోపాల్‌రెడ్డి.. రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది? ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని వారికి సూచించారు.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్తున్నారు.. ఆ తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నారు.. భారతీయ జనతా పార్టీలో చేరికపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డీకి.. ఇప్పుడు రాజీనామా ఒక్కటే అడ్డంకిగా మారింది.. రాజీనామాను అడ్డుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తే.. రాజీనామా చేసేరావాలని బీజేపీ పట్టుబడుతోంది.. దీంతో, రాజీనామాపై తేల్చుకునే పనిలోపడిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అయితే, పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతే.. పీసీసీ మార్చకుండా ఏం చేశారని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కూడా టార్గెట్‌ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కానీ, ఆయన్ని కలిసిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మాత్రం.. కాంగ్రెస్‌ అధిష్టానమన్నా, గాంధీ కుటుంబమన్నా.. ఆయనకు గౌరవం అని చెప్పుకొచ్చారు.. ఇప్పుడు ఢిల్లీకి రావాలని ఏకంగా రాహుల్‌ గాంధీయే కబురు పెట్టినా.. దానికి ససేమిరా అంటున్నారు. నాకు ఢిల్లీ పర్యటనకు ముఖ్యం కాదు.. నా నియోజకవర్గ టూరే ఇంపార్టెంట్‌ అంటూ.. నియోజకవర్గానికి బయల్దేరి వెళ్లారు..

అయితే, కాంగ్రెస్‌ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇచ్చింది.. కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి చేయని పదవులు ఏమున్నాయని ప్రశ్నించారు ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి.. ఆయన పదవుల కోసం చూసే వ్యక్తి కాదన్న ఆయన.. సీఎం కేసీఆర్‌తో కొట్లాడేది కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు.. రాజగోపాల్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయరు.. వందకు వందశాతం ఆయన కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అయితే, రాహుల్‌ గాంధీ సందేశాన్ని పంపించడం.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడం.. కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఈ పరిణామాలు చూస్తుంటే.. తగ్గేదే లే అనే తరహాలో బీజేపీ వైపు రాజగోపాల్‌ అడుగు పడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.