సెల్ఫీల మోజు కారణంగా యువత తమ ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా తెలంగాణలో సెల్ఫీ మోజులో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొండయిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి నలుగురు యువకులు వెళ్ళారు. స్నానానికంటే ముందు యువకులు అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ముగ్గురు యువకులు నదిలో పడిపోయారు.
Read Also: అంతర్వేదిలో చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలుసా?
వెంటనే గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా మరో ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరొకరి కోసం మత్స్యకారులతో కలిసి గాలిస్తున్నారు. ఈ ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురు యువకులు ఒకే కాలేజీలో చదువుతున్నట్లు తెలుస్తోంది.