మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఘటన ఇప్పుడు స్థానికంగానే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో జరిగిన తీవ్ర పొరపాట్ల కారణంగా, ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు ఉన్నట్లు అధికారికంగా నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… గూడూరు మండలం దామరవంచ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున మొదటగా బీఆర్ఎస్ మద్దతుదారు స్వాతి మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. ఆమెకు విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రం కూడా అందజేశారు. దీంతో స్వాతి వర్గం సంబరాలు జరుపుకుంది. అయితే.. అరగంట గడవకముందే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రీ-కౌంటింగ్ లేదా సాంకేతిక కారణాలంటూ అధికారులు ఒక్కసారిగా కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఒక ఓటు తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, ఆమెకు కూడా విజయం సాధించినట్లు అధికారిక సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో ఒకే సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులకు ‘గెలుపు’ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం ద్వారా ఎన్నికల అధికారులు కొత్త వివాదానికి తెరలేపారు.
ఎన్నికల అధికారి నుంచి అధికారిక పత్రాలు అందడంతో, ఇద్దరు అభ్యర్థులు తమ బంధుమిత్రులు, సన్నిహితులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా, అసలు విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. “ఒకే కుర్చీలో ఇద్దరం ఎలా కూర్చుంటాం?” అంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తుంటే, దీనికి సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ఎన్నికల ప్రక్రియలో జరిగిన ఈ అసాధారణ పరిణామం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా మారింది. ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు ఉన్నట్లు అధికారికంగా నమోదు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నార్థకంగా మారిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
