Twist In Saroornagar Boy Kidnap Case: తీవ్ర కలకలం సృష్టించిన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ కిడ్నాప్ కేసులో ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తండ్రి వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాలే ఆ యువకుడి కిడ్నాప్‌కి కారణమని పోలీసుల విచారణలో తేలింది. గురువారం అర్ధరాత్రి సరూర్‌నగర్ పీ&టీ కాలనీలో లంకా సుబ్రహ్మణ్యం అనే యువకుడ్ని కొందరు గుర్తు తెలియని దుండగులు కార్‌లో కిడ్నాప్ చేశారు. తమ బాబు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ ఆ యువకుడి తల్లిదండ్రులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా.. ఆ యువకుడు కిడ్నాప్ అయ్యాడని గుర్తించారు.
ఆ ఫుటేజ్‌లోనే నిందితులు కనిపించడంతో.. తమ దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులెవరో ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే యువకుడి కిడ్నాప్ వ్యవహారంలో గడ్డి అన్నారంకి చెందిన కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిదే ప్రధాన పాత్ర ఉందని తెలుసుకున్నారు. అతనితో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని, పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తండ్రి లంకా లక్ష్మీ నారాయణ వివాహేతర సంబంధంతో పాటు ఆస్తి తగాదాలు యువకుడి కిడ్నాప్‌కి కారణమని తేలింది.
కాగా.. గడ్డి అన్నారం డివిజన్‌లోని పీ అండ్ టీ కాలనీలో లంకా లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆయన రెండో కుమారుడైన లంకా సుబ్రహ్మణ్యం రాత్రి 12.45 గంటల సమయంలో బయటకొచ్చాడు. అప్పటికే అక్కడ కొందరు యువకులు కాపు కాసి ఉన్నారు. లంకా సుబ్రహ్మణ్యం బయటకు రాగానే.. వాళ్లు అతడ్ని కొట్టి, కారులో బలవంతంగా ఎక్కించుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.
