యాసంగి వరిధాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత వచ్చింది. అయితే కేసీఆర్ ప్రకటనతో సీఎస్ సోమేశ్ కుమార్ అధికార యంత్రాంగానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో నేటి నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద యాసంగి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ యాసంగి సీజన్‌లో సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. ధానం కొనుగోళ్లకు సుమారు 15 కోట్ల గోనె సంచులు అవసరం కానున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అయితే టెండర్లు నిర్వహించి 8 కోట్ల పాత సంచులను సేకరించేందుకు పౌరసరఫరాల శాఖ అడుగులు వేస్తోంది.
దీంతో పాటు మరో 5 కోట్ల జూట్ బ్యాగులను (గోనెసంచులు) జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) నుంచి పొందాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జేసీఐకు తెలంగాణ సర్కార్ లేఖ రాయనుంది. అయితే కొనుగోలు కేంద్రాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గోనె సంచులు కొన్ని రోజులకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. త్వరగా గోనె సంచులు అందుబాటులోకి రాకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.