తెలంగాణలో రాజకీయవేడి రాజుకుంటోంది. టీఆర్‌ఎస్ -కాంగ్రెస్ నాయకుల మధ్య రాజకీయ విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ధర్మారం మండలంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ధర్మారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళుతో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధర్మారం మండలంలో నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల నష్ట పోయిన కుటుంబాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం సాయం ఐదువేలతో పాటు తాను స్వయంగా 5 వేలు మొత్తం 10 వేలు సాయం అందచేస్తానని భరోసా కల్పించారు.
మంత్రి సందర్శించిన మరుసటి రోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్ళి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నష్ట పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. ఇక్కడే ఇరుపార్టీల మధ్య అగ్గి రాజేసుకుంది. దీనికి టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఎంతో చూపించాలని దీనికి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. సవాలుకు ప్రతి సవాలు గా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి ధర్మారంలో బహిరంగ చర్చకు వచ్చారు.
NTV Exclusive Interview: టీ హబ్ సీఈవో శ్రీనివాసరావు మహంకాళితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
స్ధానిక టి.ఆర్.ఎస్.నాయకులు చర్చకు సిద్ధపడడంతో మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఇక ధర్మారం మండల కేంద్రానికి మిలటరీ బలగాలతో భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించి ఇరు పార్టీలను కలవకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ధర్మారంలో టీఆర్ఎస్- కాంగ్రెస్ నాయకుల సవాల్ తో నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికలకు ముందే ఇలాంటి వాతావరణంతో కార్యకర్తలు ఖుషీ అవుతున్నారు.