NTV Telugu Site icon

డీసీసీలకు కొత్త పీసీసీ చీఫ్ దిశానిర్దేశం

Revanth Reddy

Revanth Reddy

పెరిగిన పెట్రోల్‌ ధరలు, నిరుద్యోగ సమస్యను నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయించింది. గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలిసారిగా సమావేశమైన పీసీసీ కమిటీ.. ఈ నెల 12, 16 తేదీల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. నిరుద్యోగుల సమస్యలపై 48 గంటల పాటు దీక్ష చేయాలని తీర్మానించింది. ఇకపై ప్రతి వారం పీసీసీ కమిటీ సమావేశం కానుంది. ఇక హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకి అప్పగించారు. వచ్చే వారంలో పార్టీ నాయకులకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించే ఆలోచనలో ఉంది పార్టీ.

పెరిగిన పెట్రో ధరలపై ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, సైకిల్, ఎడ్ల బండ్ల ర్యాలీలు చేయాలని తీర్మానించిన పార్టీ.. అటు రాష్ట్రంలోని కోవిడ్‌ మరణాలపై నిజనిర్ధారణ కమిటీ వేయయాలని భావిస్తోంది. డీసీసీలతో జరిగిన సమావేశంలో నేతలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. తనకు భేషజాలు లేవని.. అందరితో కలిసి పని చేస్తానని మాటిచ్చారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. నిన్ననే పీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేపనిలో మునిగిపోయారు.