NTV Telugu Site icon

Kadali Jaya Saradhi: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత…

Kadali Jaya Saradhi

Kadali Jaya Saradhi

టాలీవుడ్‌ను సినీ ప్రముఖుల మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి.. తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. ప్రముఖ హాస్యనటుడు కడాలి జయ సారధి ఇవాళ ఉదయం కన్నుమూశారు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.. కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నెల రోజులుగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 2.32 గంటలకు మృతి చెందారు. ఆయన పూర్తి పేరు కడలి విజయ సారథి.. 1942 జూన్ 26న పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో ఆయన జన్మించారు. 1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమైన ఆయన.. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించారు. తన సినీ ప్రస్థానంలో దాదాపు 372 తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు.. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. తెలుగు సినీ ఇండస్ట్రీ మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు జయ సారథి… మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడిగా.. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా సేవలు అందించారు.. సినీ పరిశ్రమలోనే కాదు.. నాటకరంగానికి సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించి ఆకట్టుకున్నారు.

నందమూరి తారకరామారావు దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి వెండితెరకు పరిచయం అయ్యారు జయ సారథి.. ఆయన సినీ ప్రస్థానంలో కొన్ని సినిమాలను పరిశీలిస్తే.. సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు, పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు, ఈ కాలపు పిల్లలు (1976), భక్త కన్నప్ప (1976), అత్తవారిల్లు (1977), అమరదీపం (1977), ఇంద్రధనుస్సు (1978), చిరంజీవి రాంబాబు, జగన్మోహిని (1978), మన ఊరి పాండవులు (1978), సొమ్మొకడిది సోకొకడిది (1978), కోతల రాయుడు (1979), గంధర్వ కన్య (1979), దశ తిరిగింది (1979), అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980), నాయకుడు – వినాయకుడు (1980), మదన మంజరి (1980), మామా అల్లుళ్ళ సవాల్ (1980), బాబులుగాడి దెబ్బ (1984), మెరుపు దాడి (1984) – అంజి, ఆస్తులు అంతస్తులు, శారద,
అమరదీప, ముత్యాల ముగ్గు, కృష్ణవేణి, శాంతి చిత్రాలతో పాటు ఇంకా మరెన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు..

సినిమాల్లో నటించి మెప్పించడమే కాదు.. సారధి విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా వ్యవహరించారు.. ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధి చూసారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలకు సారధి సాంకేతికంగా చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో సారధి కీలక పాత్ర పోషించారు. ఇక, జయ సారథి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు.. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.