Site icon NTV Telugu

మేడారం జాతర పనులను వేగవంతం చేయాలి: ఇంద్రకరణ్‌రెడ్డి

మేడారం జాతర పనులను వేగవంతం చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ర్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం జాతర ఏర్పాట్లను జంపన్న వాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాలను, షెడ్లను, ఇతరపనులను అటవీ పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గత జాతరలో ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తుల క్యూలైన్లు, భారీకెడ్ల ఏర్పాటుకు పత్యేకంగా చూడాలన్నారు. కోవిడ్‌, ఒమిక్రాన్‌ వేరింయట్‌లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు, స్నాన ఘట్టాల వద్ద అన్నిఏర్పాట్లు చేయాలన్నారు.

Read Also:ఏపీ, తెలంగాణకు కేంద్రం లేఖ.. విభజన సమస్యలపై చర్చిద్దాం రండి..

రహదారుల వెంట ఆర్‌అండ్‌బీ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని, పార్కింగ్‌కుఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. పోలీసులు సీసీ కెమెరాలతో జాతర పనులను పర్యవేక్షించాలన్నారు. జాతర అనంతరం చెత్తతొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. జనవరి 15 నాటికి జాతర పనులన్ని పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అంతకముందు మంత్రులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version