తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో (Pollution Control Board) ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డులో ఖాళీగా ఉన్న ‘అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II)’ పోస్టుల భర్తీ కోసం గత నెలలో టిజిపిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని (Maximum Age Limit) భారీగా పెంచుతూ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని ఇప్పటివరకు ఉన్న 34 సంవత్సరాల నుండి ఏకంగా 44 సంవత్సరాలకు పెంచుతున్నట్లు టిజిపిఎస్‌సి అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థన మేరకు జారీ చేసిన జీవో నంబర్ 86 (G.O.Ms.No.86) ను అనుసరించి, కమిషన్ ఈ 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపును (Age Relaxation) వర్తింపజేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వయస్సు అయిపోయిందని బాధపడుతున్న వేలాది మంది సీనియర్ అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు పోటీ పడేందుకు మరో అద్భుతమైన అవకాశం లభించినట్లయింది.
ఈ వయోపరిమితి పెంపుతో పాటు అభ్యర్థులకు మరో బిగ్ రిలీఫ్ ఇచ్చింది సర్వీస్ కమిషన్. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే రాతపరీక్షను (Written Exam) కేవలం ఇంగ్లీషులోనే కాకుండా, అభ్యర్థుల సౌకర్యార్థం ఇంగ్లీషుతో పాటు తెలుగు మీడియంలో కూడా నిర్వహించనున్నట్లు టిజిపిఎస్‌సి స్పష్టం చేసింది. దీనివల్ల తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఎగ్జామ్ రాయడం మరింత సులభం కానుంది. ఈ మార్పుల నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుని పక్కా ప్లానింగ్‌తో ప్రిపేర్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
