TGCSB: మీ మనీ.. మీ క్లిక్.. మీ ఛాయిస్.. హెచ్చరికలు జారీ చేసిన సైబర్ క్రైమ్ బ్యూరో..

Cyber Crime

Cyber Crime

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సైబర్ జాగ్రూక్తా దివస్ సందర్భంగా ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఆన్‌లైన్ మోసాలు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల దుర్వినియోగం తీవ్రంగా పెరిగిపోతున్నాయని పేర్కొంది. సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో బ్రాండెడ్ వస్తువులు, హాలిడే ప్యాకేజీలు, ఆన్‌లైన్ కోర్సులపై భారీగా 70 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇస్తున్నారని తెలిపింది. వీటిని నమ్మి ముందస్తుగా డబ్బులు చెల్లిస్తే సరుకులు పంపకుండా, వెబ్‌సైట్లను మూసివేసి ఫోన్ నంబర్లు బ్లాక్ చేస్తున్నారని స్పష్టం చేసింది.

మరొక తీవ్రమైన మోసంలో భాగంగా, క్రెడిట్ కార్డు పరిమితి పెంపు లేదా రివార్డ్ పాయింట్ల పేరుతో నకిలీ ఆండ్రాయిడ్ యాప్ (APK) ఫైళ్లు, ఫిషింగ్ లింకులను పంపుతున్నారని హెచ్చరించింది. వీటిని డౌన్‌లోడ్ చేయడం వల్ల కార్డు నంబర్, సీవీవీ, పిన్ మరియు ఓటీపీ వంటి రహస్య సమాచారం మోసగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని తెలిపింది. ఈ వివరాలతో ఖాతాదారులకు తెలియకుండానే దేశీయ, విదేశీ లావాదేవీలు జరిపి డబ్బులు కాజేస్తున్నారని వివరించింది.

ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండటానికి సోషల్ మీడియా ద్వారా వచ్చిన అనుమానాస్పద లింకులు లేదా ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్​స్టాల్ చేయవద్దని అధికారులు సూచించారు. రహస్య బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, ఆఫర్ల నిజానిజాలను కేవలం అధికారిక యాప్‌లు లేదా కస్టమర్ కేర్ ద్వారానే నిర్ధారించుకోవాలని కోరారు. ఆన్‌లైన్ చెల్లింపులు చేసే ముందు ఒక్క క్షణం ఆగి అన్ని వివరాలు సరిచూసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి గంటలోనే జాతీయ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో తక్షణమే ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

సకాలంలో స్పందించడం ద్వారా కోల్పోయిన సొత్తును రికవర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని TGCSB నొక్కి చెప్పింది. ప్రతి ఆన్‌లైన్ కొనుగోలులోనూ, సమాచారం పంచుకోవడంలోనూ పౌరులు స్వీయ జాగ్రత్తలు పాటించడమే సైబర్ నేరాల నుండి రక్షణ పొందే మార్గం.