DSC Results 2024: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో డీఎస్సీ పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి, నామా, కొండ సురేఖ, సీఎస్.. విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్ష రాశారు.
విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఫలితాల కోసం విశేష కృషి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2,46,584 మంది డిఎస్సి 2024 పరీక్షలకు హాజరు అయ్యారని తెలిపారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు విడుదల చేసామన్నారు. ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు చేస్తాం. 9.10.2024 లోపు సర్టిఫికెట్ వేరిఫికేషన్ చేసి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామన్నారు. తెలంగాణలో దసరా పండుగ ప్రతీ ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారన్నారు. గత ప్రభుత్వం 7 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారన్నారు. డిఎస్సి నిర్వహణ చేయక పోవడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 66 రోజుల్లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయడంలో పేద ప్రజల పట్ల మా చిత్తశుద్ధి కనిపిస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 30 రోజుల్లోనే ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగడి సరుకుగా మారిందన్నారు. త్వరలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అన్ని శాఖల్లోని భర్తీ కానీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. గతంలో పేరుకు పోయిన చెత్తను తొలగిస్తామని వివరించారు. ఉపాధ్యాయ ఉద్యోగం భావోద్వేగాలతో కూడిన పోస్టులు చేశారని తెలిపారు. గతంలో గురుకులాలు ఏర్పాటు చేశానన్న చంద్రశేఖర్ రావు పిట్టగూళ్ల లాంటి నిర్మాణాలు చేశారని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. పది సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్స్, బదిలీలు జరగలేదని తెలపిఆరు. ఎలాంటి వివాదాలు లేకుండా బదిలీలు చేశామన్నారు. 21419 మందికి ప్రమోషన్స్ ఇచ్చామన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవని కొందరు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వారు ఏం చేశారు? అని ప్రశ్నించారు. అన్ని స్కూల్స్ లో మౌలిక వసతులు కల్పించడం మా ప్రభుత్వ భాద్యత అన్నారు. నెహ్రు కృషి వల్ల వ్యవసాయ రంగం బలోపేతం అయ్యిందన్నారు.