TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!

  • టీజీపీఎస్సీ నుంచి 102 పోస్టులతో కొత్త నోటిఫికేషన్
  • 18 నుంచి 44 ఏళ్లు.. అభ్యర్థులకు వయోపరిమితి
  • స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ.. పోస్టులకు విద్యార్హతలు ఇవే
  • అక్టోబర్ 30 నుంచి దరఖాస్తులు.. నవంబర్ 27 చివరి తేదీ
Tgpsc

Tgpsc

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనుండగా, అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు నవంబర్ 27 చివరి తేదీగా ప్రకటించారు.

ఏ పోస్టులు? ఎన్ని ఖాళీలు?

టీజీపీఎస్సీ నోటిఫికేషన్ నంబర్ 07/GES/2026 ప్రకారం, ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్ పరిధిలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు జోనల్ కేడర్ పరిధిలోకి వస్తాయి. మొత్తం 102 ఖాళీలు ఉన్నాయి.

వయోపరిమితి ఎంత?

2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 44 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే వయోపరిమితి సడలింపుల వివరాలను పూర్తి నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

విద్యార్హతలు ఇవే

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ప్రధానంగా స్టాటిస్టిక్స్ ఒక ముఖ్యమైన సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీతో పాటు డిగ్రీ చదివిన ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో లేదా మూడు సంవత్సరాల్లో స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. అభ్యర్థులు తమ డిగ్రీ సబ్జెక్టులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలకు సరిపోతాయో లేదో ముందుగా నిర్ధారించుకోవాలి.

జీతం ఎంత వస్తుంది?

ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ పే స్కేల్ రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు ఉంటుంది. పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, దరఖాస్తు నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఎక్కడ చేయాలి?

అర్హులైన అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30, 2026న ప్రారంభమై నవంబర్ 27, 2026న ముగుస్తుంది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, అర్హతలు పరిశీలించి ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.