Telangana Thalli Statue : భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో జరుగుతున్నది అంతా అసత్య ప్రచారమని, వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. ఆ వేడుక కోసం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో 12 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
అయితే.. గ్లోబల్ సమ్మిట్ ముగియడంతో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండాలని, ముందు జాగ్రత్తగా విగ్రహాన్ని భద్రంగా పక్కకు వాల్చి, క్లాత్ ర్యాపింగ్ (బట్టతో చుట్టడం) చేశారు. విగ్రహాన్ని తరలింపు కోసం పక్కకు వాల్చిన సమయంలో, ఎవరో దురుద్దేశపూర్వకంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ప్రభుత్వం పేర్కొంది.
“తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు” అని ఆర్ అండ్ బీ శాఖ వివరించింది. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలాంటి అగౌరవం జరగలేదని, విగ్రహాన్ని అత్యంత భద్రంగా ర్యాపింగ్ చేసి గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ వర్క్ షాప్‌కు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇట్టి అసత్యపు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ప్రభుత్వం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.
Deputy CM Pawan Kalyan: కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు..
