Telangana State Won Ease Of Doing Business Award 2022: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు దక్కింది. ‘మీ సేవ’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు గుర్తింపుగా.. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్’ ఈ అవార్డ్‌ని ప్రసాదించింది. గురువారం న్యూ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన డిజిటెక్ కాంక్లేవ్ 2022లో.. ఈ అవార్డును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేయడం(ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ఆ మేగజైన్ ప్రశంసించింది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తోన్న సంస్కరణలతో పాటు.. ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్నారని కొనియాడింది.
ఈ సంధర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పుల గురించి, ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్‌లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, టీ-వాలెట్ సాధించిన మైలురాళ్ల గురించి వివరించారు. టీఎస్ ఐపాస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, అలాగే టీఎస్ బీపాస్‌లో దరఖాస్తుల అనుమతుల్ని.. వరుసగా 15, 21 రోజుల్లో పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉందన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎకనామిక్ టైమ్స్ పురస్కారం మరో నిదర్శనమన్నారు. ఇదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన పరిశోధన చేసిన ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రికకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.