తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న టెన్త్ (ఎస్ఎస్‌సీ), ఓఎస్‌ఎస్‌సీ , ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా విడుదల చేసింది. రెగ్యులర్ , వన్స్-ఫెయిల్ అయిన అభ్యర్థులు సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎంలు) , ప్రిన్సిపాల్స్ తక్షణమే స్పందించి విద్యార్థులకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఫీజు చెల్లింపు , దరఖాస్తుల గడువు తేదీలు
అపరాధ రుసుం (లేట్ ఫీజు) లేకుండా అక్టోబర్ 30, 2026 నుంచి నవంబర్ 16, 2026 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1, 2026 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు జమ చేయవచ్చు. అలాగే రూ. 50 లేట్ ఫీజుతో నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు, రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు, , రూ. 500 లేట్ ఫీజుతో డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28, 2026 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు విధించారు. విద్యార్థుల ఆన్‌లైన్ డేటాను డీఈఓలకు సమర్పించడానికి చివరి తేదీలను కూడా అధికారులు వేర్వేరుగా ఖరారు చేశారు.
పరీక్ష ఫీజు వివరాలు , ముఖ్యమైన మార్గదర్శకాలు
అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజు రూ. 125 కాగా, మూడు సబ్జెక్టుల కంటే తక్కువ ఉంటే రూ. 110, మూడు సబ్జెక్టులకు మించితే రూ. 125గా నిర్ణయించారు. ఒకేషనల్ అభ్యర్థులు రెగ్యులర్ ఫీజుకు అదనంగా రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 2027 పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఏ పరిస్థితుల్లోనూ ఫీజు చెల్లింపు గడువు పొడిగించబడదని, సైబర్ ట్రెజరీ ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ ద్వారా మాత్రమే పాఠశాల లాగిన్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. ఐఎఫ్‌ఎంఐఎస్ (IFMS) పోర్టల్ చలాన్లు లేదా మాన్యువల్ బ్యాంక్ చలాన్లు ఏవీ స్వీకరించబడవని స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

