Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు

  • బియ్యం వ్యాపారులపై అధికారుల దాడులు
  • 2,686 తనిఖీలు.. 370 కేసులు
  • బస్తాల బరువులోనూ భారీ మోసాలు
  • తెలంగాణ సోనా కిలో రూ.74 మాత్రమే
Rice

Rice

సామాన్యుల నడ్డి విరుస్తున్న బియ్యం ధరల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ రంగంలోకి దిగింది. నిత్యావసర సరుకుల ధరలను అడ్డగోలుగా పెంచుతూ, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కొరడా ఝళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘించిన కేటుగాళ్లపై కఠిన చర్యలు ప్రారంభించారు.

2,686 తనిఖీలు.. 370 కేసులు నమోదు

రాష్ట్రంలో బియ్యం అక్రమాలు, అధిక ధరల విక్రయాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2,686 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తూ, వినియోగదారులను మోసగిస్తున్న వ్యాపారులను గుర్తించి ఇప్పటివరకు 370 కేసులు నమోదు చేశారు. మార్కెట్‌లో దళారులు , అక్రమార్కులు సామాన్యులను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమని అధికారులు స్పష్టం చేశారు.

అసలు మోసాలు ఇవే.. బస్తాపై 26 కిలోల లేబుల్

మార్కెట్‌లో వినియోగదారులను మోసం చేయడానికి వ్యాపారులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కేవలం ధరల పెంపు మాత్రమే కాకుండా, తూకంలోనూ భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు తనిఖీలలో తేలింది. నిబంధనల ప్రకారం 25 కిలోల బస్తాపై అదే బరువును ముద్రించాల్సి ఉండగా.. కొన్ని చోట్ల 26 కిలోలని లేబుల్ వేసి వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

తెలంగాణ సోనా ధర రూ.74 మించకూడదు

ప్రముఖ రకమైన ‘తెలంగాణ సోనా’ బియ్యం ధర కేవలం కిలోకి రూ.74 మాత్రమే ఉండాలని, అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతి బియ్యం ప్యాకెట్‌పై తప్పనిసరిగా ఎంఆర్‌పీ (MRP) ముద్రించి ఉండాలని ఆదేశించారు. వినియోగదారులు కూడా కొనుగోలు చేసే సమయంలో ఎంఆర్‌పీ ధరను పరిశీలించాలని సూచించారు.

పీడీ యాక్ట్ అస్త్రం.. అధిక ధరలకు విక్రయిస్తే జైలుకే: స్టీఫెన్ రవీంద్ర

పేదలకు అందాల్సిన పీడీఎస్ (PDS) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసే వారిపై ‘పీడీ యాక్ట్’ (PD Act) ప్రయోగిస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించి ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే నేరుగా జైలుకే వెళ్లాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. మార్కెట్‌లో ధరల నియంత్రణ కోసం పౌర సరఫరాల శాఖ తరఫున నిరంతర నిఘా కొనసాగుతుందని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.