Telangana Rains: తెలంగాణ రాష్ట్రంపై వర్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మరింత జోరందుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ సహా అనేక జిల్లాలు వర్షాల దెబ్బకి అతలాకుతలం అయ్యాయి. ఈ సందర్భంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. కాగా, భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. రామాయంపేటలో సుమారు 300 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో సమయానికి స్పందించి రెస్క్యూ బృందాలు.. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
Read Also: Abduction Case: యువకుడి కిడ్నాప్ కేసు.. పరారీలో స్టార్ హీరోయిన్!
అలాగే, భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు ఈరోజు (ఆగస్టు 28) సెలవు ప్రకటించారు. రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కాగా, ఈ వర్షాల దెబ్బకు రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రోడ్లు జలమయం కావడంతో పాటు పలు రైళ్లు కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇక, తెలంగాణ విశ్వవిద్యాలయం ఇవాళ (ఆగస్టు 28న) జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు.
