Drugs : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ముఠాలపై పోలీసులు దాడులు మరింత వేగవంతం చేశారు. ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో భారీగా డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నాలుగు మంది డ్రగ్ పేడ్లర్లను అరెస్టు చేసి 91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకుని మరో 5 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. ఇదే సమయంలో వరంగల్‌లో కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో మూడు మందిని అదుపులోకి తీసుకొని 32 కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు 8 లక్షల రూపాయలని పోలీసులు వెల్లడించారు.
Social Media Reels Addiction: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు మీతోనే!
ములుగు జిల్లా వాజేడు పరిధిలో ఇద్దరిని అరెస్టు చేసి 30 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. దాని విలువ 7.5 లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది. వరంగల్ ఇనావోలు పరిధిలో మరో పేడ్లర్‌ను అరెస్టు చేసి భారీగా 214 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసిన గంజాయి విలువ 53.5 లక్షలు అని పోలీసులు తెలిపారు.
ఇక సంగారెడ్డిలో ఆల్ప్రాజొలామ్ తయారీ యూనిట్‌ను గుట్టురట్టు చేసిన పోలీసులు, 270 గ్రాముల ఆల్ప్రాజొలామ్, 7.890 కేజీల నోర్డయాజిపామ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంలను అరెస్టు చేశారు. మొత్తంగా ఈ దాడుల్లో పోలీసులు 16.31 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
