Site icon NTV Telugu

Revanth Reddy Apology : కోమటిరెడ్డి డిమాండ్‌కు దిగొచ్చిన రేవంత్‌… బేషరతుగా క్షమాపణ..

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎపిసోడ్‌తో పాటు.. మునుగోడు ఉప ఎన్నికలు.. చండూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభ పెద్ద రచ్చగా మారిపోయింది.. తాజా పరిణామాలపై శుక్రవారం ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ వీడినందుకు తనను టార్గెట్ చేసి అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. ఆ పార్టీ కోసం పనిచేస్తున్న తనను రేవంత్ రెడ్డి హోంగార్డుతో పోల్చడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో తనను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకట్‌రెడ్డి.. చండూరు సభలో ఓ పిల్లగానితో తనను తిట్టించారని, అక్కడే అతడిని లాగిపెట్టి కొట్టాల్సిందన్నారు.. తన లాంటి సీనియర్‌ను తిట్టిన అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, తిట్టించిన వాళ్లు (పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి) క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.. అయితే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌కు దిగివచ్చిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

Read Also: Independence Day 2022: మీకు తెలుసా..? ఇండియాతో పాటు ఆగస్టు 15న స్వాతంత్య్రం జరుపుకునే దేశాలు ఇవే..

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. చండూరు సభలో అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యలు మంచిది కాదన్న ఆయన.. ఈ ఘటనపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్షమాపణలు కోరారు.. నేను ఎలాంటి కండిషన్ లేకుండా క్షమాపణలు చెబుతున్నట్టు వీడియోలో పేర్కొన్నారు.. ఇక, మీడియా సమయంలో హోంగార్డు ప్రస్తావన చేసినందుకు కూడా క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు.. మొత్తంగా.. క్షమాపణ చెప్పాలన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌తో దిగివచ్చిన తెలంగాణ పీసీసీ చీఫ్‌.. క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఇదే సమయంలో.. అద్దంకి దయాకర్‌పై క్రమశిక్షణా చర్య కోసం ఇది, తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి పరిణామంగా చెబుతున్నారు విశ్లేషకులు.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి ఇది దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి నన్ను హోంగార్డుతో పోల్చి అవమానించాడు. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని నాకు క్షమాపణలు చెప్పాలని కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే… వేరే పార్టీలో నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి.. నాలాంటి వారందరినీ బయటకు పంపించేసి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనుకుంటున్నాని సంచలన ఆరోపణలు చేశారు… పార్టీలో నాకు జరుగుతున్న అవమాలను గురించి సోనియా, రాహుల్ గాంధీతో మాట్లాడి తేల్చుకుంటానని ప్రకటించిన ఆయన.. మునుగోడు ఉపఎన్నికపై జరిగే సమావేశానికి నన్ను ఆహ్వానించలేదు. వారు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమీ తెలియడం లేదు. అందుకే మునుగోడు ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.. అయితే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పడంతో.. మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెంకట్‌రెడ్డి వస్తారా? అనే చర్చ ఆస్తికరంగా మారింది.. వస్తే.. తన తమ్ముడిని ఎలా టార్గెట్‌ చేస్తారు అనే చర్చ కూడా సాగుతోంది.

Exit mobile version