Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్

  • నాన్‌-డెయిరీ పనీర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
  • సెప్టెంబర్ 10 నుంచే నిషేధం అమల్లోకి
  • తయారీ నుంచి అమ్మకం వరకు అన్ని దశలపై బ్యాన్
  • ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగానే నిర్ణయం
Paneer

Paneer

తెలంగాణలో నాన్‌-డెయిరీ పనీర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నాన్‌-డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్‌ లేదా అనలాగ్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌ 10, 2026 నుంచి ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా నాన్‌-డెయిరీ, ఆర్టిఫిషియల్ లేదా అనలాగ్ పనీర్‌ను ఏ రూపంలోనైనా తయారు చేయడం, ప్రాసెసింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం వంటి కార్యకలాపాలపై నిషేధం వర్తించనుంది. అంటే ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి విక్రయించే వరకు అన్ని దశల్లోనూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌–2006లోని సెక్షన్ 30(2)(a) కింద తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుని రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్‌ను ప్రభుత్వం నోటిఫై చేసింది. 2026 సెప్టెంబర్‌ 10 తేదీతో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 807లో ఈ వివరాలను పొందుపరిచారు.

నిషేధ ఉత్తర్వులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించాలని సంబంధిత వర్గాలను అధికారులు ఆదేశించారు. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.