NTV Telugu Site icon

Telangana IT Ministry Twitter: తెలంగాణ ఐటీ మినిస్ట్రీ ట్విటర్ ఖాతా హ్యాక్.. కానీ గంటలోనే..

Telangana It Ministry

Telangana It Ministry

Telangana IT Ministry Twitter Account Hacked: ఈమధ్య హ్యాకర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రభుత్వాలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలనే హ్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఐటీ మినిస్ట్రీ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేశారు. కూల్ క్యాట్స్ హ్యాకర్లు ఈ పనికి పాల్పడ్డారు. ప్రొఫైల్ పిక్‌లో ఒక పిల్లి పోస్టర్‌ని పెట్టారు. బయోని కూడా మార్చేశారు. అంతేకాదండోయ్.. ‘ఐ ద మినిష్టర్ ఆఫ్ ఇండియా’ అంటూ ఏవేవో ట్వీట్లు కూడా చేశారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఐటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, కేవలం గంట సమయంలోనే ట్విటర్ ఖాతాను పునరుద్ధరించారు. హ్యాకర్లు చేసిన ట్వీట్లను సైతం ఖాతా నుంచి తొలగించేశారు.

కొన్ని రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విటర్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కూల్ క్యాట్స్ తరహాలోనే మంకీస్ పేరుతో ఆ ఖాతాను ఒక హ్యాకర్ల బృందం హ్యాక్ చేసింది. అందులో ఎలాన్ మస్క్‌కి సంబంధించి పలు ట్వీట్లు చేయడంతో పాటు షేర్స్ గురించి సమాచారాన్ని షేర్ చేశారు. ఐటీ నిపుణులు వెంటనే రంగంలోకి దిగినప్పటికీ.. 24 గంటలసేపు ఆ హ్యాకర్లు ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి ఎలాగోలా హ్యాకర్ల చేతి నుంచి ఖాతాను చేజిక్కించుకోగలిగారు. ఈమధ్య ఇలాంటి పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటుండటంతో.. ‘సైబర్ హైజీన్’ (తమ ఖాతాను పటిష్టం చేసుకోవడం కోసం యూజర్ల మెయింటెయిన్ చేసే సిస్టమ్) పద్ధతిని పాటించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.