Site icon NTV Telugu

Telangana Forest University: తెలంగాణలో తొలి ఫారెస్ట్ వర్సిటీకి బీజం.. ఛాన్స్‌లర్‌గా సీఎం కేసీఆర్

Telangana Forest University

Telangana Forest University

Telangana Introduce First Forest Bill In Assembly: తెలంగాణ రాష్ట్రంలో తొలి అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీజం పడింది. ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీని సిద్ధం చేయాలని.. దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని ఫిక్స్ అయ్యింది. ఇందుకు సంబంధించి ‘తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022’కు సంబంధించిన బిల్లును సైతం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై తొలుత అసెంబ్లీలో, ఆ తర్వాత శాసనమండలిలో చర్చ జరగనుంది. అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణ కోసం అర్హులైన అటవీ వృత్తి నిపుణులను తయారు చేయడమే ఈ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యం. ఈ వర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. ఆయన ఈ వర్సిటీకి తొలి వీసీని నియమించనున్నారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ నియామకం.. సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ ద్వారా జరగనుంది.

పారిశ్రామిక, గృహ అవసరాల నుంచి వచ్చే డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు.. తోట పంటల ద్వారా ఉత్పత్తి చేసేలా తగిన పద్ధతుల అభివృద్ధి, పరిశోధనకు ఈ యూనివర్సిటీ దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే.. సంప్రదాయక అటవీ వ్యవసాయం, సహజసిద్ధమైన అడవులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా పరిశోధనలు చేయడంలో ఈ వర్సిటీ అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర అవసరాలు, జాతీయ విధానాలకు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్త్రాల్లో కొత్త కోర్సులు, ఉన్నత ప్రమాణాలతో కూడా విద్యను అందించేలా ఈ అటవీ విశ్వవిద్యాలయాన్ని ప్రతిపాదించారు.

Exit mobile version