Site icon NTV Telugu

Ration Card Holders: తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ శుభవార్త.. జూన్ 2 నుంచే ప్రారంభం..

Ration Cards

Ration Cards

తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా రూ. 5 లక్షల భారీ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి 15 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

రేవంత్ రెడ్డి భరోసా..

నేడు మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకంపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. తెలంగాణలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా భావించేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు.

ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన…

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం వివరాలను వెల్లడించారు. ఈ పథకం 2026, జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము ఆదుకుంటుందన్నారు.

ప్రపంచంలోనే తొలిసారి.. 

పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికీ వర్తించేలా ఇంత భారీ స్థాయిలో జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. సామాజిక అంతరాలు లేకుండా ప్రతి పౌరుడికి భద్రత కల్పించే ఇలాంటి మహత్తర పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని మంత్రి భట్టి పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలు రోడ్డున పడకూడదనే మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, ప్రజలపై ఎలాంటి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Exit mobile version